మధుమేహం (డయాబెటిస్) చికిత్స కోసం మెట్‌ఫొర్మిన్ ఆధారిత మందులను వాడటం వలన శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి కాలేయం, మూత్రపిండాల సమస్యలతో పాటు కాన్సర్‌కు దారి తీస్తుందని ప్రముఖ భారతీయ ఎండోక్రినాలజిస్ట్ డా. మనోహర్ ఇటీవల తమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నరంటూ డాక్టర్ వస్త్రాలు ధరించి ఉన్న ఒక వ్యక్తి ఫోటోని షేర్ చేస్తూ పబ్లిష్ చేసిన కథనం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది. మధుమేహం టైప్-2 చికిత్సలో భాగంగా రోగులు మెట్‌ఫొర్మిన్ మందులు వాడటం వలన అధిక రక్త పోటు, అతిసారం, కడుపునొప్పి, కాలేయం సమస్యలు, అంధత్వం మరియు కాన్సర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని డా. మనోహర్ తమతో తెలిపినట్టు ఈ కథనంలో తెలిపారు. ‘sheopalsdiabetes.com’ అనే వెబ్సైట్ పబ్లిష్ చేసిన కథనంలో మధుమేహం వ్యాధి చికిత్స కోసం హెర్బల్ డయాబెటిస్ క్యాప్సూల్స్‌లను వాడాలని డా. మనోహర్ సూచించినట్టు, ఈ హెర్బల్ డయాబెటిస్ క్యాప్సూల్స్‌లలో ఎటువంటి రసాయనక పదార్ధాలు ఉండవని, ఈ మందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలాజి 2015లో ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ కథనంలో తెలిపిన సమాచారంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మధుమేహం చికిత్స కోసం మెట్‌ఫొర్మిన్ మందులు వాడితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి కాలేయం, మూత్రపిండాల సమస్యలతో పాటు కాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశముందని ఎండోక్రినాలజిస్ట్ డా. మనోహర్ పేర్కొన్నారు.
ఫాక్ట్ (నిజం): డాక్టర్ వస్త్రాలలో పోజ్ ఇస్తూ దిగిన ఒక మాడెల్ ఫోటోని ఎడిట్ చేసి, మధుమేహం చికిత్స కోసం మెట్‌ఫొర్మిన్ మందులను వాడటం వలన అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని, మధుమేహం చికిత్స కోసం ‘sheopals India’ మార్కెటింగ్ చేస్తున్న హెర్బల్ డయాబెటిస్ క్యాప్సూల్స్‌లను వాడాలని ప్రముఖ డాక్టర్ సూచించినట్టు ఈ కల్పిత కథానాన్ని పబ్లిష్ చేశారు. మధుమేహం టైప్-2 చికిత్స కోసం ఉపయోగించే మెట్‌ఫొర్మిన్ మందుల వాడకం వలన రోగి శరీరంలో ఇన్సులిన్ శాతం పెరిగి, కాలేయం మరియు కిడ్నీలలో సమస్యలొస్తాయని ఎటువంటి శాస్త్రీయ పరిశోధన లేదా అధ్యయనం నిర్ధారించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, దేశంలో మనోహర్ పేరుతో చాలా మంది ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్లు ఉన్నట్టు గుర్తించాము. కానీ, ఈ డాక్టర్ల ఫోటోలెవీ ఆర్టికల్‌లో షేర్ చేసిన ఫోటోలోని వ్యక్తితో పోలి లేవు. ఆర్టికల్‌లో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోతో పోలి ఉన్న ఫోటో ఒకటి “shutterstock” వెబ్సైటులో దొరికింది. డాక్టర్ వస్త్రాలలో పోజ్ ఇస్తూ దిగిన ఒక మాడెల్ ఫోటోని ఎడిట్ చేసి ఈ ఫోటోని రూపొందించారని ఈ ఒరిజినల్ ఫోటో ద్వారా తెలిసింది.
ఈ ఫోటోలోని మోడెల్ ఇతర వేశాలలో దిగిన మరికొన్ని ఫోటోలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ‘sheopals India’ అనే సంస్థ సంబంధం లేని చిత్రాలని షేర్ చేస్తూ కల్పిత కథనాన్ని వైరల్ చేస్తున్నట్టు పలు సోషల్ మీడియా యూసర్లు ట్వీట్లు కూడా పెట్టారు.
మెట్‌ఫొర్మిన్ దేనికోసం ఉపయోగిస్తారు?
అమెరికా ఫుడ్ అండ్ డృగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదించిన మెట్‌ఫొర్మిన్ డ్రగ్‌ని టైప్-2 మధుమేహం చికిత్స కోసం సాధారణంగా ఉపయోగిస్తారు. మెట్‌ఫొర్మిన్ శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడంతో పాటు శరీరం ఇన్సులిన్‌కు ప్రతిస్పంధించడంలో సహాయ పడుతుందని FDA తమ వెబ్సైటులో తెలిపింది. కాలేయం తయారుచేసే చక్కెర పరిమాణాన్ని తగ్గించడంలో, పేగులు ఆహారం నుంచి గ్రహించే చక్కెర శాతాన్ని తగ్గించడంలో మెట్ఫార్మిన్ తోడ్పడుతుందని తెలిసింది. అంతేకాదు, మెట్‌ఫొర్మిన్ మందులలో కాన్సర్‌ను నిరోధించే లక్షణాలు ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ (NCBI) పలు కథానాలలో తెలిపింది.
మెట్‌ఫొర్మిన్ డ్రగ్ వలన కలిగే దుష్ప్రభావాలు:
మెట్ఫార్మిన్ మందులు వాడటం వలన విరేచనాలు, వికారం మరియు వాంతులు వంటి సాధారణ దుష్ప్రభావాలు కలిగే అవకాశముందని, కొంతమంది రోగులలో ఛాతీ అసౌకర్యం, తలనొప్పి, డయాఫోరేసిస్, హైపోగ్లైసీమియా, బలహీనత, రినిటిస్ మరియు లాక్టిక్ అసిడోసిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని NCBI తమ రిపోర్టులో తెలిపారు.
కాలేయ కాన్సర్‌కు కారణమయ్యే ఎన్-నైట్రోసోడిమెథైలామైన్ (NDMA) రసాయన పదార్ధం మెట్ఫార్మిన్ మందులలో అధిక శాతంలో ఉందని అనుమనిస్తూ FDA, మెట్ఫార్మిన్ తయారుచేసే సంస్థలను తమ ఉత్పత్తులను తిరిగి మూల్యాంకనం చేసి పరీక్షలు నిర్వహించాలని 2020లో కొరినట్టు తెలిసింది. కానీ, ఈ మెట్ఫార్మిన్ మందులలోని NDMA రసాయనాల శాతం వలన కాన్సర్ బారిన పడే అవకాశం చాలా తక్కువని పలు మెడికల్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అలాగే, మెట్‌ఫొర్మిన్ వాడకం వలన రోగి శరీరంలోఇన్సులిన్ శాతం పెరుగుతుందని, వాటి వాడకం వలన కాలేయం మరియు కిడ్నీలలో సమస్యలొస్తాయని ఏ ఒక్క శాస్త్రీయ అధ్యయనం నిర్ధారించలేదు.
ఇక పోస్టులో తెలుపుతున్న హెర్బల్ డయాబెటిస్ క్యాప్సూల్స్ ‘sheopals India’తో పాటు అమాజోన్, ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్సైటులలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ హెర్బల్ డయాబెటిస్ క్యాప్సూల్స్‌లను వేపాకు, కాకరకాయ, అమల మొదలగు పదార్ధాలతో తయారు చేసినట్టు ‘sheopals India’ ఈ ప్రాడక్ట్ వివరణలో తెలిపింది. వేపాకు, కాకరకాయ పదార్ధాలలో మధుమేహాన్ని నియంత్రించే లక్షణాలు ఉన్నట్టు NCBI పలు రిపోర్టులలో స్పష్టం చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ హెర్బల్ డయాబెటిస్ క్యాప్సూల్స్‌లను అంబ్రోషియా హెల్త్ సైన్స్ అనే సంస్థ రూపొందించినట్టు, ‘sheopals India’ వెబ్సైట్ ఈ ప్రాడక్ట్ మార్కెటింగ్ చేస్తున్నట్టు వివరణలో స్పష్టంగా తెలిపారు.
చివరగా, మధుమేహం వ్యాధి చికిత్స కోసం మెట్‌ఫొర్మిన్ మందులను వాడటం వలన ఇన్సులిన్ శాతం పెరిగి కాలేయం, కిడ్నీ సమస్యలతో పాటు కాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటూ ప్రచురించిన ఈ కథనంలో సమాచారం అవాస్తవం.