అంబేడ్కర్ జయంతి రోజు అంబేడ్కర్ ఊరేగింపుని అడ్డుకున్న ముస్లింలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో కొందరు వ్యక్తులు పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: అంబేడ్కర్ జయంతి ఊరేగింపుని ముస్లింలు అడ్డుకుంటున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగింది. జాతవ్ సామాజిక వర్గానికి చెందిన వారు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఊరేగింపు నిర్వహించగా, ఈ ఊరేగింపు ఠాకూర్లు ఉండే ప్రాంతానికి చేరుకోగానే, ఆ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఊరేగింపుకు వ్యతిరేకంగా రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు సంబంధించిన FIR మరియు పోలీసులు చెప్తున్నదాని ప్రకారం నిందితుల్లో ఎవరూ ముస్లిములు లేరు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోలోని దృశ్యాలు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మథురలో అంబేడ్కర్ జయంతి నాడు జరిగిన ఘటనకు సంబంధించినవి. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఈ ఊరేగింపుపై రాళ్లు విసిరింది ముస్లింలు కాదు.
ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం మథురలోని నగల భారతీయ అనే ఊరులో జాతవ్ సామాజిక వర్గానికి చెందిన వారు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు.
ఐతే ఈ ఊరేగింపు ఠాకూర్లు ఉండే ప్రాంతానికి చేరుకోగానే, ఆ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఊరేగింపుకు వ్యతిరేకంగా రాళ్లు రువ్వారు. కొంత సేపటికి పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. వార్తాకథనాల ప్రకారం FIR రిజిస్టర్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన FIR కాపీలోని నిందితుల పేర్లు పరిశీలిస్తే వారిలో ఎవరూ ముస్లిం కాదు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం జైట్ పోలీస్ స్టేషన్ SHO అజయ్ వర్మను సంప్రదించగా రాళ్లు రువ్విన నిందితుల్లో ఒక్కరు కూడా ముస్లిం లేడని స్పష్టం చేసాడు.
దీన్నిబట్టి ఈ ఘటనలో ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా అర్ధమవుతుంది.
చివరగా, అంబేడ్కర్ జయంతి ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఈ ఘటనకు ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు.