Fake News, Telugu
 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రజలపై బీజేపీ వివక్ష చూపుతుందని సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రజలు నాగపూర్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల మైదానం మలినం అయ్యిందనే కారణంతో బీజేపీ కార్యకర్తలు అక్కడ గోమూత్రం, గంగా జలం చల్లి శుద్ధి చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

మరిన్ని పోస్టులను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: నాగపూర్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రజలు పాల్గొనడం వల్ల మైదానం మలినం అయ్యిందని బీజేపీ కార్యకర్తలు గోమూత్రం, గంగా జలం చల్లి శుద్ధి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: వీడియోలోని దృశ్యాలు అంబేద్కర్ జయంతికి సంబంధించినవి కావు. 16 ఏప్రిల్ 2023న నాగపూర్‌లోని దర్శన్ కాలనీ మైదానంలో మహారాష్ట్ర ప్రతిపక్షాల కూటమి అయిన ‘మహా వికాస్ ఆఘాడి’ రాజకీయ సభ నిర్వహించింది. ఈ సభ వల్ల మైదానం అశుభ్రం అయ్యిందని కాలనీ వాసులతో కలిసి కొందరు బీజేపీ సభ్యులు గోమూత్రం, గంగా జాలం చల్లారు. ఏప్రిల్ 02న ఛత్రపతి శంభాజీ నగర్ లో జరిగిన మొదటి సభలో కూడా ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపి పార్టీలతో కలవడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు సభా ప్రాంగణంలో గోమూత్రం చల్లారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

స్థానిక మీడియా కథనాల (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం ఈ ఘటన 17 ఏప్రిల్ 2023న నాగపూర్‌లోని దర్శన్ కాలనీ మైదానంలో జరిగింది.

ఏప్రిల్ 16వ తేదీన ఇదే మైదానంలో మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీల కూటమి ‘మహా వికాస్ ఆఘాడి’ రాజకీయ సభ నిర్వహించింది. అయితే ఈ సభ జరగక ముందు, స్థానిక కాలనీ సంఘాలతో కలిసి బీజేపీ నాయకులు ఈ సభ జరగడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని బాంబే హై కోర్టులో 12 ఏప్రిల్ 2023న పిటిషన్ దాఖలు చేశారు. ఈ మైదానాన్ని కేవలం క్రీడలకు మాత్రమే వినియోగించడానికి అభివృద్ధి చేశారని, రాజకీయ సభలు నిర్వహిస్తే మైదానంలోని మౌలిక సదుపాయాలతో పాటు కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే బాంబే హైకోర్టు, ఈ సభకు అనుమతిని రద్దు చేయలేమని, సభను యథావిధిగా నిబంధనలకు లోబడి నిర్వహించవచ్చని తీర్పు ఇచ్చింది.

సభ జరగడం వల్ల మైదానం అపరిశుభ్రం అయ్యిందని కాలనీ వాసులతో కలిసి కొందరు బీజేపీ కార్యకర్తలు గో మూత్రం, గంగా జలం చల్లారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో పేర్కొంది. అలాగే ఏప్రిల్ 02న జరిగిన ఛత్రపతి శంభాజీ నగర్ లో ‘మహా వికాస్ ఆఘాడి’ సభ జరిగిన తర్వాత కూడా కొందరు బీజేపీ సభ్యులు సభా ప్రాంగణం వద్ద గో మూత్రం చల్లారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపిల పై పోరాటం గురించి మాట్లాడేవారని, కానీ ఉద్ధవ్ ఠాక్రే ఆ రెండు పార్టీలతో కలిసి ఇక్కడ సభ నిర్వహించినందున మైదానాన్ని శుద్ధి చేయడానికే అలా చేశామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

ఇక నాగపూర్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో బీజేపీ సభ్యులు గో మూత్రం/గంగా జలంతో మైదానాన్ని శుద్ధి చేసినట్లు ఎక్కడా రిపోర్ట్ కాలేదు.

చివరిగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు పాల్గొన్న అంబేద్కర్ జయంతి సభ వల్ల మైదానం మలినం అవ్వడంతో బీజేపీ సభ్యులు దాన్ని గో మూత్రంతో శుభ్రం చేస్తున్నారని సంబంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll