Fake News, Telugu
 

రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే బడాచోర్లు అందరూ గుజరాతీయులే అనే ఈ ఆరోపణలో వాస్తవం లేదు

0

రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే బడాచోర్లు అందరూ గుజరాతీయులే అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. 10 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ మాల్యా కూడా అందులో ఒకరని అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే బడాచోర్లు అందరూ గుజరాతీయులే, అందులో విజయ మాల్యా కూడా ఒకడు.

ఫాక్ట్: విజయ మాల్యా గుజరాతీ కాదు, అతను పుట్టింది పశ్చిమ బెంగాల్ లో, గుజరాత్ లో కాదు. విజయ మాల్యా రెండు సార్లు కర్ణాటక నుండి రాజ్య సభ సభ్యునిగా కూడా ఎన్నుకోబడ్డారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఏబీజీ షిప్‌యార్డ్ బ్యాంకు స్కాంలో మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి అగర్వాల్‌ను సీబీఐ ప్రశ్నించింది; అతను విదేశాలకు పారిపోయినట్టు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. విజయ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసుల్లో బ్యాంకులకు రూ.18,000 కోట్లు తిరిగి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు చెప్పారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.         

పోస్టులో పెట్టిన పేర్లలో విజయ మాల్యా గుజరాతీ కాదు, అతను పుట్టింది పశ్చిమ బెంగాల్ లో, గుజరాత్ లో కాదు. విజయ మాల్యా రెండు సార్లు కర్ణాటక నుండి రాజ్య సభ సభ్యునిగా కూడా ఎన్నుకోబడ్డారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కు సంబంధించి సుమారు 9 వేల కోట్ల బ్యాంకు స్కాంలో విజయ మాల్యా నిందితుడిగా ఉన్నారు.

నీరవ్ మోదీ మరియు మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో నిందితులుగా ఉన్నారు; ఈ స్కాం 2018లో వెలుగులోకి వచ్చింది. మెహుల్ చోక్సీ పుట్టింది ముంబైలో అయినా తన వ్యాపారం ఎక్కువ వరకు గుజరాత్ లోనే చేసారు; నీరవ్ మోడీ మరియు మేహుల్ చోక్సీ ఇద్దరూ చుట్టాలు.

భారత్‌లోని బ్యాంకుల నుంచి వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ. కానీ, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఏబీజీ షిప్‌యార్డ్ బ్యాంకు స్కాంలో మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి అగర్వాల్‌ను సీబీఐ ప్రశ్నించింది; అతను విదేశాలకు పారిపోయినట్టు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.

2020లో భారత్‌లో వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు 72 మంది ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో తెలిపింది. ఆర్థిక అవకతవకలు, మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు 72 మంది లిస్టులో అందరూ గుజరాతీయులే అని ఎక్కడా కూడా లేదు. ఉదాహరణకు ఆయుధాల కొనుగోలుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సంజయ్ భండారి అనే వ్యక్తి ఉన్నారు, ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి.

ఇటీవల, విజయ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసుల్లో బ్యాంకులకు రూ.18,000 కోట్లు తిరిగి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002కి సంబంధించిన మొత్తం కేసుల్లో రూ.67000 కోట్ల ఆర్థిక నేరాలు ఉన్నాయని తెలిపారు. అందరూ గుజరాతీయులే అని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు.

చివరగా, రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే బడాచోర్లు అందరూ గుజరాతీయులే అనే ఈ ఆరోపణలో వాస్తవం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll