“మొన్న కర్ణాటకలో దేవాలయం ప్రసాదంలో విషం కలిపి దాదాపు 18 మంది చావుకి కారణం ఒక క్రిస్టియన్” అని అంటూ ఒక మహిళ ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలోని దేవాలయం ప్రసాదంలో విషం కలిపి దాదాపు 18 మంది చావుకి కారణం అయిన ఒక క్రిస్టియన్ మహిళ.
ఫాక్ట్: 2018లో కర్ణాటకలోని ఒక దేవాలయం ప్రసాదంలో విషం కలిపి దాదాపు 17 మంది చావుకి కారణం అయిన కేసులో నిందితురాలు క్రిస్టియన్ కాదు. ఇటువంటి క్లెయిమ్ 2018లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో చామరాజనగర్ పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇది ఫేక్ న్యూస్ అని అప్పుడే తేల్చి చెప్పారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులోని మహిళ యొక్క ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటోతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. 20 డిసెంబర్ 2018న ప్రచురించబడిన ఈ ఆర్టికల్‌లో, కర్ణాటకలోని దేవాలయంలో విషం కలిపి దాదాపు 15 మందిని చంపిన సంఘటన గురించి తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కొల్లేగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, తరువాత కస్టడీలోనే ఉంచినట్టు అప్పటి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఈ ఆర్టికల్స్‌లో, అంబికా అనబడే నిందితురాలు క్రిస్టియన్ అని లేదు. దేవాలయానికి సంబంధించిన వ్యవహారాలు తమ చేతుల్లోనే ఉండాలన్న దురాశతో ప్రత్యర్దులను ఇరికించడానికి విషం కలిపినట్టు తెలిపారు.
ఇటువంటి క్లెయిమ్ 2018లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో చామరాజనగర్ పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇది ఫేక్ న్యూస్ అని తేల్చారు. అంబికాతో పాటు మిగితా ముగ్గురు నిందుతులు కన్వర్టెడ్ క్రిస్టియన్ లేదా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారు కాదని ప్రెస్ రిలీజ్ లో తెలిపారు.
చామరాజనగర్ PRL. DISTRICT AND SESSIONS JUDGE COURT లో ఇంకా ఈ సంఘటనకు సంబంధించిన కేసు నడుస్తుంది. ఈ కేసుకి సంబంధించిన ఛార్జెస్ లో ‘పారిఫోస్’ అనే పురుగుమందు విషంలాగా వాడి దాదాపు 17 మందిపై హత్య; 117 మందిపై హత్యా ప్రయత్నం చార్జెస్ వేసారు. కేసుకి సంబంధించి తదుపరి హియరింగ్ 01 డిసెంబర్ 2021న ఉంది. కేసు డీటెయిల్స్ లో గాని, ఛార్జెస్ లో గాని ఎక్కడా కూడా అంబికా అనబడే నిందితురాలు క్రిస్టియన్ అని లేదు.
చివరగా, 2018లో కర్ణాటకలోని దేవాలయం ప్రసాదంలో విషం కలిపి 17 మంది చావుకి కారణం అయిన ఘటనలో ఆరోపణలు ఎదురుకొంటున్న ఈ మహిళ క్రిస్టియన్ కాదు.