అనాధలుగా ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని విద్యాబుద్ధులు నేర్పించి ఇద్దరికి హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి చేసి పంపిస్తున్న ముస్లిం మతానికి చెందిన పఠాన్ బాబు, అని షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలని సాగనంపుతున్న ఫోటోలు ఈ పోస్టులో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అనాధలుగా ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని హిందూ సాంప్రదాయం ప్రకారం పెండ్లి చేసి పంపించిన ముస్లిం మతానికి చెందిన పఠాన్ బాబు.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు అమ్మాయిలు అనాధలు కాదు. ఆ ఇద్దరు అమ్మాయిల తల్లి అయిన సవితా భుసారి, తన ఎదురింట్లో ఉన్న పఠాన్ బాబుని తన సోదరుడిగా భావించి ప్రతి సంవత్సరం రాకీ కడుతూ వచ్చింది. ఆ అనుబంధంతో పఠాన్ బాబు, సవిత భుసారి ఇద్దరి అమ్మాయిల పెళ్ళిల్లకి మేనమామలా వ్యవహరించారని విశ్లేషణలో తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే ఫోటోలని షేర్ చేస్తూ ‘Maharashtra Times’ న్యూస్ వెబ్సైటు వారు ‘22 ఆగష్టు 2020’ నాడు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. పఠాన్ బాబు అనే ముస్లిం మతానికి చెందిన వ్యక్తి, తన ఎదురింట్లో నివాసం ఉంటున్న సవితా భుసారి పిల్లల పెళ్ళికి మేనమామలా వ్యవహరించి అన్ని కార్యక్రమాలు చుసుకున్నట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్ర లోని అహ్మద్ నగరంలో చోటు చేసుకుందని అందులో తెలిపారు. సవితా భుసారి తన ఎదురింట్లో నివాసముంటున్న పఠాన్ బాబుని సొంత సోదరుడిగా భావించి ప్రతి సంవత్సరం రాఖి కడుతూ వచ్చింది అని, ఆ అనుబంధంతోనే పఠాన్ బాబు సవిత భుసారి ఇద్దరి కుమార్తలైన గౌరీ మరియు సావేరి పెళ్లిల్లకి మేనమామలా వ్యవహరించారని ఆర్టికల్ లో తెలిపారు. తన భర్త కుటుంబాన్ని విడిచివెళ్ళినప్పటికీ, సవితా భుసారి తన ఇద్దరి కుతుర్లని ఎంతో కష్టపడి చదివించింది అని, దీనికి తన సోదరుడుగా భావించే పఠాన్ బాబు సాయం అందించాడని అందులో తెలిపారు.
ఇదే విషయాన్నీ తెలుపుతూ సమీర్ గైక్వాడ్ అనే కాలమ్నిస్ట్ తన ఫేస్బుక్ పేజి లో తెలిపారు. ఆ పోస్టుని మనం ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఫోటోలో ముస్లిం వ్యక్తి సాగనంపుతున్న ఇద్దరు అమ్మాయిలు అనాధలని షేర్ చేస్తున్న ఈ పోస్ట్ తప్పు.