Fake News, Telugu
 

తమిళనాడులోని తిరునల్లార్ దాటుతున్న సమయంలో నాసా ఉపగ్రహాల వేగం తగ్గిపోతుందన్న వార్తలో నిజం లేదు

0

నాసా ప్రయోగించిన ఉపగ్రహాలు తమిళనాడులోని తిరునల్లార్ శని భగవాన్ ఆలయాన్ని దాటుతున్న సమయంలో మూడు నిమిషాల పాటు ఆగిపోయాయని, ఇందుకు గల కారణాలు తెలుసుకునేందుకు నాసా పంపించిన శాస్త్రవేత్తలు కూడా దీనికి కచ్చితమైన కారణాలు తెలుసుకోలేకపోయారని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కాకపోతే ఈ ఆలయం UV కిరణాలూ ఎక్కువగా పడే ప్రదేశంలో నిర్మించారని, 30 నెలలకు ఒకసారి జరిగే శని త్రయోదశి నాడు UV కిరణాలూ తీవ్రంగా పడతాయి, దాని వల్లే ఆ సమయంలో ఉపగ్రహాల వేగం తగ్గుతుందని నాసా భావిస్తుందని కూడా ఈ వీడియోలో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నాసా ప్రయోగించిన ఉపగ్రహాలు తమిళనాడులోని తిరునల్లార్ శని భగవాన్ ఆలయాన్ని దాటుతున్న సమయంలో ఆగిపోయాయి.

ఫాక్ట్(నిజం): ఇలా జరిగిందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నాసా కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ ధృవీకరించలేదు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసారు. తమిళనాడులోని ఒక ప్రైవేటు పబ్లిషింగ్ సంస్థ మొదట ఈ విషయాన్ని తమ పాఠ్యపుస్తకంలో ప్రచురించింది. కాని ఈ విషయానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు అందించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సాధారణంగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని తట్టుకొని చంద్రుడి చుట్టూ  నిర్దిష్ట వేగంతో తిరిగేలా సాటిలైట్‌లను కక్షలోకి ప్రవేశపెడతారు. ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చెప్తున్నట్టు ఒకవేళ సాటిలైట్‌ల వేగం తగ్గిపోతే, అప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల అవి భూమిపై పడిపోయే అవకాశం ఉంది.

కాబట్టి వీడియోలో చెప్తున్నట్టు తమిళనాడులోని తిరునల్లార్ ఆలయాన్ని దాటుతున్న సమయంలో నాసా ఉపగ్రహాల వేగం తగ్గుతున్నాయనడానికి ఎటుంటి శాస్త్రీయ ఆధారాలు లేక అధికారిక రికార్డ్స్ గానీ లేవు. నాసా కూడా ఇలాంటి పరిణామాలు రిపోర్ట్ అయ్యినట్టు ఎప్పుడూ ప్రకటించలేదు. ఒకవేళ ఇలా నిజంగా జరిగి ఉంటే మీడియాలో ఈ విషయానికి సంబంధించిన కథనాలు ఉండేవి, కాని మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు.

శాస్త్రవేత్తలు ఈ వార్తను ఖండించారు:

ఐతే ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండడంతో తమిళనాడుకు చెందిన ఒక వార్తా సంస్థ ఈ విషయంపై ఇస్రో శాస్త్రవేత్తలను సంప్రదించగా, వారు ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలా జరిగే అవకాశం లేదని, భారతదేశానికి చెందిన 10 ఉపగ్రహాలు భూగోళం చుట్టూ తిరుగుతున్నాయి, కాని ఇలా ఎప్పుడు జరగలేదని వారు స్పష్టం చేసారు.

తమిళనాడుకు చెందిన ఒక ప్రైవేటు పబ్లిషింగ్ సంస్థ ప్రచురించిన నాలుగో తరగతి పాఠ్యపుస్తకంలో మొదట ఈ విషయాన్ని ప్రచురించింది. తమిళనాడులోని కొన్ని స్కూల్స్‌ ఈ పుస్తకాన్ని వాడుతున్నప్పటికీ, ఈ పుస్తకానికి తమిళనాడు పాఠ్యపుస్తకాల అసోసియేషన్ గుర్తింపు లేదు.

కాగా పైన తెలిపిన వార్తా సంస్థ ఈ పాఠం రాసిన టీచర్‌ను సంప్రదించగా, అతను ఈ విషయానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు అందించలేదని పేర్కొంది. అలాగే ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన సంస్థను సంప్రదించగా, వారు ఈ పాఠాన్ని తొలగిస్తామని చెప్పినట్టు పేర్కొంది.

ఐతే కొన్ని వార్తా సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించుకోకుండా ప్రచురించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కానీ, ఇది పూర్తిగా కల్పితమైన కథనం, ఇలా జరిగిందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

చివరగా, తమిళనాడులోని తిరునల్లార్ దాటుతున్న సమయంలో నాసా ఉపగ్రహాల వేగం తగ్గిపోతుందన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll