Fake News, Telugu
 

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో బీజేపీ మూడో స్థానంలో లేదు, ఈ వాదన తప్పు

0

ఇటీవల 23 ఫిబ్రవరి 2022న తమిళనాడు లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఫలితాల ద్వారా రాష్ట్రంలో బీజేపీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 31% ఓట్లు పడ్డాయని క్లెయిమ్ చేస్తున్న మరొక పోస్టు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ పోస్టులలో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది; ఈ ఎన్నికల్లో బీజేపీకి 31% ఓట్లు వచ్చాయి.

ఫాక్ట్ (నిజం): తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం, మొత్తం 12838 వార్డులకు (కార్పొరేషన్/ మున్సిపాలిటీ/టౌన్ పంచాయతీ) గాను బీజేపీ 308 స్థానాలతో నాలుగో  స్థానంలో నిలిచింది. ఒకవేళ ఇండిపెండెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే బీజేపీ ఐదో స్థానికి పడిపోతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్లు మొత్తం 1945 వార్డులతో కాంగ్రెస్ మరియు బీజేపీ కన్నా ముందున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైటులో ఏ వార్డు నుండి ఎవరు గెలిచారు మరియు మొత్తంగా ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలిచాయి అన్న సమాచారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచింది.

ఐతే  ఏ పార్టీకి ఎంత శాతం వోట్లు పోల్ అయ్యాయి అన్న సమాచారాన్ని ఎన్నికల సంఘం ఇంకా (24 ఫిబ్రవరి 2022 వరకు) వెల్లడించలేదు. కాబట్టి పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు బీజేపీ 31% వోట్లు వచ్చాయన్న వాదన తప్పు.

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, బీజేపీ మొత్తం 1374 కార్పొరేషన్ వార్డులకు గాను 22 వార్డుల్లో గెలుపొందింది. అలాగే 2843 మున్సిపల్ వార్డులకు గాను 56, మొత్తం 7621 టౌన్ పంచాయతీ వార్డులకు గాను 230 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అంటే అన్ని లోకల్ బాడీ వార్డులకు గాను 308 వార్డులు గెలుచుకుంది.

ఐతే కేవలం పార్టీలను పరిగణలోకి తీసుకొని, మొత్తంగా గెలిచిన వార్డుల సంఖ్యను బట్టి చూస్తే, బీజేపీ రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది. మొదటి మూడు స్థానాలలో DMK, AIADMK మరియు INC ఉన్నాయి.

ఎన్నికలు రద్దు అయినా లేదా వాయిదా వేయబడ్డ స్థానాలు తీసేస్తే, మిగతా 12818 స్థానాలలో  7701 వార్డులు గెలిచి అనగా 60.08% శాతంతో డీఎంకే మొదటి స్థానంలో ఉంది. 2008 వార్డులతో అన్నాడీఎంకే 15.7% తదుపరి స్థానంలో ఉండగా, 592 వార్డులతో 4.62% విజయ శాతంతో INC మూడవ స్థానంలో నిలిచింది. 308 వార్డులను గెలుచుకోవడం ద్వారా 2.4% గెలుపు శాతంతో బీజేపీ నాల్గవ అతిపెద్ద వ్యక్తిగత పార్టీగా నిలిచింది.

ఒకవేళ ఇండిపెండెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే బీజేపీ ఐదో స్థానికి పడిపోతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్లు మొత్తం 1945 వార్డులతో కాంగ్రెస్ మరియు బీజేపీ కన్నా ముందున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన వార్తా కథనాలు కూడా ఇదే విషయాన్నీ దృవీకరిస్తున్నాయి.

చివరగా, తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో బీజేపీ మూడో స్థానంలో లేదు, ఈ వాదన తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll