Fake News, Telugu
 

నిస్సహాయ స్థితిలో ఒంటరిగా కూర్చున్న చిన్నారిని చూపుతున్న ఈ వీడియో గాజాకు సంబంధించినది

0

ప్రసుత్తం బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో, శిథిలాల మధ్య ఒంటరిగా కూర్చొని నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారిని చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోను షేర్ చూస్తూ ఈ వీడియోలోని దృశ్యాలు బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న హిందువులకు చెందిన ఒక నిస్సహాయ హిందూ బిడ్డను చూపిస్తున్నదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రసుత్తం బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో దాడికి గురైన నిస్సహాయ హిందూ బిడ్డను చూపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): నిస్సహాయ స్థితిలో ఒంటరిగా కూర్చున్న చిన్నారిని చూపుతున్న ఈ దృశ్యాలు గాజాకు సంబంధించినవి. ఇదే వైరల్  వీడియోను అల్ జజీరా మీడియా సంస్థ వారి అధికారిక X (ట్విట్టర్)లో 14 జూలై 2024న షేర్ చేస్తూ, “గాజాలోని నుస్రత్‌ క్యాంప్‌లోని UNRWA పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి తరువాత నిస్సహాయ స్థితిలో ఒంటరిగా కూర్చున్న చిన్నారిని ఈ వీడియో చూపిస్తుంది” అని పేర్కొన్నది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే  హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం, మహిళలపై దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).

పలు రిపోర్ట్స్ ప్రకారం, బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా 05 ఆగస్టు 2024న రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినప్పటి నుండి మైనారిటీలను, ముఖ్యంగా హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొన్ని జరిగిన హింసకు వ్యతిరేకంగా 09 ఆగస్టు 2024న వందలాది మంది హిందూ ప్రజలు బంగ్లాదేశ్ రాజధాని మరియు బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో నిరసన తెలిపారు (ఇక్కడ , ఇక్కడ , & ఇక్కడ).

ఇకపోతే ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో ‘అల్ జజీరా’ మీడియా సంస్థ లోగో ఉండటం మనం గమనించవచ్చు. అలాగే, వీడియోలో కుడి వైపు అరబిక్‌లో ‘నుసీరాత్ క్యాంప్ – గాజా’ అని పేర్కొన్ని ఉండటం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు గాజాకు సంబంధించినవి అని స్పష్టమవుతోంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను ‘అల్ జజీరా’ మీడియా సంస్థ వారి అధికారిక X(ట్విట్టర్)లో 14 జూలై 2024న షేర్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు గాజాకు చెందినవని తెలుస్తుంది. “గాజాలో UNRWA నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించెందుకు నిర్వహిస్తున్న నుస్రత్‌ శిబిరంలో ఉన్న #Abu_Urayban పాఠశాలలో కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ బాంబు దాడి చేసిన తర్వాత ఒంటరిగా భయంతో కూర్చున్న చిన్నారి ” అని పోస్టు పేర్కొన్నది (అరబిక్ నుండి తెలుగు లోకి అనువదించగా). ఇదే వీడియోకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న ఫోటోను 14 జూలై 2024న “అల్ జజీరా ముబాషర్” వారి అధికారిక ఫేస్‌బుక్ లో కూడా పోస్ట్ చేసింది.

ఇవే దృశ్యాలను కలిగిన వీడియోను అమెరికాకు చెందిన CBS News అనే మీడియా సంస్థ వారి యూట్యూబ్ ఛానల్లో 20 జూలై 2024న షేర్ చేసింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత గాజాలోని పరిస్థితులను ఈ వీడియో చూపిస్తున్నది. ఈ వీడియో గాజాలోని నుస్రత్‌ శరణార్ధ శిబిరంపై జరిగిన దాడి తర్వాత దృశ్యాలను చూపిస్తుంది అని పేర్కొన్న మరిన్ని రిపోర్టులు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, నిస్సహాయ స్థితిలో ఒంటరిగా కూర్చున్న చిన్నారిని చూపుతున్న ఈ వీడియో గాజాకు చెందింది.

Share.

About Author

Comments are closed.

scroll