Fake News, Telugu
 

వీడియోలోని దృశ్యాలు టర్కీ భూకంప మృతుల సామూహిక ఖననాలకు సంబంధించినవి కావు

0

ఇటీవల టర్కీలో సంభవించిన భూకంపం వలన వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఈ విపత్తులో మరణించిన వారి అంతిమ సంస్కారాల దృశ్యాలంటూ ఒక వీడియో మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: టర్కీ భూకంపం వలన మరణించిన వారి అంతిమ సంస్కారాల దృశ్యాలు.

ఫాక్ట్: వీడియోలోని దృశ్యాలు ఫిబ్రవరి-మార్చి 2022 లో ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరంలో రష్యా దాడిలో మరణించిన పౌరుల యొక్క సామూహిక ఖననానికి సంబంధించినవి. 06 ఫిబ్రవరి 2023లో సంభవించిన టర్కీ భూకంపం వలన మరణించిన వారిని కూడా పలు చోట్ల సామూహికంగా ఖననం చేసినప్పటికీ, వైరల్ వీడియోలోని దృశ్యాలు టర్కీ భూకంపానికి సంబంధించినవి కావు. కాబట్టి, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, సరిగ్గా ఇదే వీడియోని 15 మార్చి 2022 న ప్రముఖ మీడియా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్ ‘AP Archive’ యూట్యూబ్‌లో అప్‌లోడు చేసినట్లు గుర్తించాము. వీడియో కింద ఇచ్చిన వివరణ ప్రకారం, ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరంపై 2022 ఫిబ్రవరి, మార్చి నెలలో రష్యా చేసిన దాడిలో అనేక మంది పౌరులు మృతి చెందారు. వీడియోలోని దృశ్యాలు మరణించిన వారిని సామూహికంగా ఖననం చేయడం చూపిస్తాయి.

అయితే ఇటీవల 06 ఫిబ్రవరి 2023లో సంభవించిన టర్కీ-సిరియా భూకంపాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మీడియా కథనాల ప్రకారం, మృతులను కొన్ని ప్రదేశాలలో సామూహిక ఖననం చేశారు. కానీ, వైరల్ వీడియోలో చూపించే దృశ్యాలు టర్కీ భూకంపానికి సంబంధించినవి కాదు.

చివరిగా, వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలు ఇటీవల టర్కీ భూకంపంలో మరణించిన వారి సామూహిక ఖననానికి సంబంధించిన దృశ్యాలు కావు.

Share.

About Author

Comments are closed.

scroll