Fake News, Telugu
 

గుంటలతో నిండిపోయిన ఈ రోడ్లకి అంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు

0

గుంటలతో ఉన్న రోడ్లపై నుండి వాహనాలు ఇబ్బంది పడుతూ వెళ్తున్న వీడియోని షేర్ చేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్, కదిరిలోని కాలేజీ సర్కిల్ నుండి టవర్ క్లాక్ మధ్య రోడ్డని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. పూర్తిగా గుంటలతో నిండిపోయిన ఒక రోడ్డు ఫోటోని ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల పరిస్థితి అంటూ మరొక పోస్టు కూడా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుంటలతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల వీడియో మరియు ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ గుంటల రోడ్డు వీడియో మన దేశానికి సంబంధించింది కాదు. వీడియోలో వాహానాలు రోడ్డుకి కుడి వైపున ప్రయానిస్తున్నాయి, సాధారణంగా భారత దేశంలో వాహానాలు రోడ్డుకి ఎడమ వైపు ప్రయాణిస్తాయి. చాలా వరకు ఆధారాలు ఈ వీడియో చైనాకి సంబంధించినట్టు సూచిస్తున్నాయి. ఇకపొతే గుంటలతో నిండిపోయిన రోడ్డు ఫోటో బీహార్‌లో ఒక రోడ్డుకి సంబంధించింది. ఇది పాత ఫోటో, ప్రస్తుతం ఈ రోడ్డు ఇలా లేదు. ఈ వీడియో మరియు ఫోటోకి అంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వీడియో:

ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే వీడియోలో వాహానాలు రోడ్డుకి కుడి వైపున ప్రయానిస్తుండడం గమనించొచ్చు. కాని మన దేశ రూల్స్ ప్రకారం రోడ్డుకి ఎడమ వైపు నుండి వాహానాలు నడపాలి. దీన్నిబట్టి ఈ వీడియో మన దేశానికి సంబంధించింది కాదని అనిపిస్తుంది.

ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా యూట్యూబ్‌లోని పలు చానల్స్‌లో అప్లోడ్ చేసిన వీడియోలు కనిపించాయి, అలాంటి ఒక వీడియోని ఇక్కడ చూడొచ్చు. ఐతే యూట్యూబ్‌లోని వీడియోలో ఎడమ వైపు పై భాగాన ‘LiveLeak’ అనే వాటర్ మార్క్ గమనించొచ్చు. ఈ వాటర్ మార్క్ ఆధారంగా గూగుల్‌లో వెతకగా  LiveLeak వెబ్సైట్ ‘Potholes on Chinese roads after heavy rains’ అనే టైటిల్‌తో ఇదే వీడియోని అప్లోడ్ చేసిన హైపర్ లింక్ కనిపించింది, కాని ఈ వెబ్సైటు మన దేశంలో ఓపెన్ కావట్లేదు.

పైగా వీడియోలో కనిపిస్తున్న హోర్దింగ్స్‌ని పరిశీలిస్తే, వీటిపై ఏదో విదేశీ భాషలో రాసి ఉన్నట్టు గమనించొచ్చు. ఐతే ఇది ఏ భాషనో ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఈ భాష మాత్రం భారత దేశానికి సంబంధించింది కాదని అర్ధమవుతుంది. ఈ వివరాల ఆధారంగా ఈ వీడియో కదిరికి గాని లేక అంధ్రప్రదేశ్‌కి గాని సంబంధించింది కాదని స్పష్టంగా అర్ధమవుతుంది.  

గతంలో కూడా ఇదే వీడియో తెలంగాణ పేరుతో వైరల్ అయినప్పుడు FACTLY ఆ వార్తను డీబంక్ చేస్తూ రాసిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఫోటో:

ఈ ఫోటో బీహార్‌లోని భాగల్పూర్ NH-80 రోడ్డు కి సంబంధించింది. 2017లో టైమ్స్ నౌ ఈ రోడ్డు దుఃస్థితి గురించి రాసిన కథనంలో ఇదే ఫోటోని ప్రచురించింది.

ఐతే ఈ రోడ్డు పరిస్థితి బాగోలేదంటూ పోస్టులోని గుంటలు పడ్డ ఈ ఫోటో 2017లో వైరల్ అయినప్పుడు, అప్పటి బీహార్ రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన తేజస్వి యాదవ్ ఈ రోడ్డు ప్రస్తుతం ఇలా గుంటలతో లేదంటూ, బాగుచేసిన రోడ్డు ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేసాడు. ఏబీపీ ఛానల్ కూడా వైరల్ అయిన ఫోటోలో ఉన్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా వైరల్ అయిన ఫోటోలో ఉన్న రోడ్డు ప్రస్తుతం గుంటలతో లేదని, దీని స్థానంలో కొత్త రోడ్డు వేసారని ద్రువీకరించింది.

గతంలో కూడా ఇదే ఫోటో తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్ పేర్లతో వైరల్ అయినప్పుడు FACTLY ఆ వార్తలను డీబంక్ చేస్తూ రాసిన కథనాలను ఇక్కడ చూడొచ్చు.

చివరగా, గుంటలతో నిండిపోయిన ఈ రోడ్లకి అంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll