బంగారు తెలంగాణలోని రోడ్ల పరిస్థితి ఇది అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటలు పడివున్న రోడ్డు పై వాహనాలు ప్రయాణిస్తున్న దృశ్యాలు వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రంలోని గుంటలు పడివున్న రోడ్డు పై వాహనాల ప్రయాణిస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఆ గుంటలు పడివున్న రోడ్డు, తెలంగాణకు సంబంధించినది కాదు. ఇదే వీడియోని షేర్ చేస్తూ చాల మంది చైనా దేశానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. అలాగే, వీడియోలోని రోడ్డు పై ప్రయాణిస్తున్న వాహనాలు భారతదేశం యొక్క ట్రాఫిక్ రూల్స్ కి విరుద్దంగా వెళ్తున్నట్టు గమనించవచ్చు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్నచాలా వీడియోలు యూట్యూబ్ చానల్స్ లో దొరికాయి. ఆ వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. గుంటలు పడివున్న వీడియోలోని ఆ రోడ్డు చైనా దేశానికి సంబంధించినది అని వీడియోల కింద ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ పైన ‘LiveLeak’ లోగో మనం చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా మరికొంత సమాచారం కోసం వెతకగా, గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ‘LiveLeak’ వెబ్సైటు వారు ‘Potholes on Chinese roads after heavy rains’ అనే టైటిల్ తో పెట్టిన లింక్ దొరికింది. కాని, భారత దేశం నుంచి ఆ ‘LiveLeak’ వెబ్సైటు ఓపెన్ కావడం లేదు.
వీడియోలోని రోడ్డు పై చూపిస్తున్న బిల్ బోర్డులు విదేశీ బాషలో ఉండటం గమనించవచ్చు. బిల్ బోర్డులపై చూపిస్తున్న ఆ బాష ఏ దేశానికి సంబంధించినది అని కచ్చితంగా చెప్పలేము కానీ, ఆ బాష భారతదేశానికి సంబంధించిన బాష కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే, రోడ్డు పై ప్రయాణిస్తున్న వాహనాలు భారతదేశం యొక్క ట్రాఫిక్ రూల్స్ కి విరుద్దంగా ప్రయాణం చేస్తున్నట్టు గమనించవచ్చు. వాహనాలన్నీ రోడ్డుకి కుడి వైపు ప్రయాణిస్తున్నట్టు వీడియోలో చూడవచ్చు, కానీ భారత్ లో రూల్స్ ప్రకారం రోడ్డుకి ఎడమ వైపుకి డ్రైవ్ చెయ్యాలి.
చివరగా, గుంటలు పడివున్న రోడ్డు పై ప్రయాణిస్తున్న వాహనాల వీడియో తెలంగాణకు సంబంధించినది కాదు.