Fake News, Telugu
 

ఈ వీడియోలో కారు చెక్కడాలు ఇండోనేషియా ఆలయంలోనివి; ఇవి 1865లో చెక్కారు, 800 ఏళ్ళ క్రితం కాదు

0

ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోతో పాటు షేర్ చేస్తున్న పోస్టులో కారు చెక్కడాలు భారతదేశంలోని ఒక దేవాలయంలోవి అని, అవి 800 ఏళ్ళ క్రితమే చెక్కారని , పాశ్చాత్య దేశాల సంస్కృతి పుట్టక ముందే ఇవి చేసారని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో చూద్దాం.

వీడియో యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఈ కారు చెక్కడాలు భారతదేశంలోని ఒక దేవాలయంలోవి, అవి 800 ఏళ్ళ క్రితమే చెక్కారు , పాశ్చాత్య దేశాల సంస్కృతి పుట్టక ముందే ఇవి చేసారు.

ఫాక్ట్(నిజం): వీడియోలో చూపిస్తున్నది ఇండోనేషియా దేశంలోని బాలీలో ఉన్న ‘పురా దలేమ్ జాగరాగా ఆలయం’. దీనిలో విమానాలు, సైకిళ్లు, కార్లు, తుపాకులు మరియు ఇతర ఆధునిక వస్తువుల ప్రత్యేకమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం మొదలు 12వ శతాబ్దంలో నిర్మించబడింది, అయితే 1848 యుద్ధం సమయంలో ధ్వంసమైంది. 1865లో దీన్ని పునర్నిర్మించిన్నప్పుడు ఆలయ గోడలపై ఆధునిక ఆవిష్కరణలు అయిన కారు, విమానాలు, సైకిల్ మొదలైనవి చెక్కారు . అంటే ఈ శిల్పాలు సుమారు 150 సంవత్సరాల పాతవే. అందువల్ల, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు 2024 ఆగస్టు 3న ప్రవీణ్ మోహన్ అనే యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేసిన పూర్తి నిడివి గల వీడియోను గుర్తించాయి. ఆ వీడియో శీర్షిక “800 సంవత్సరాల పాత ఆలయంలో కారు, విమానం & బైక్ చెక్కబడింది? చరిత్ర తప్పుగా ఉందా?” అని ఉంది.

ఈ వీడియోలో చూపిస్తున్నది ఇండోనేషియా దేశంలోని బాలీలో ఉన్న ‘పురా దలేమ్ జాగరాగా ఆలయం’. దీనిలో విమానాలు, సైకిళ్లు, కార్లు, తుపాకులు మరియు ఇతర ఆధునిక వస్తువుల ప్రత్యేకమైన శిల్పాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన క్లిప్, పూర్తి వీడియోలో 0:28 సెకన్ల వద్ద తీసుకోబడింది.

మరింత పరిశీలన కోసం గూగుల్ సర్చ్ ద్వారా మేము ఇండోనేషియా టూరిజం వెబ్‌సైట్‌కు చేరుకున్నాం, ఇది పురా దలేం జాగరాగా గురించి మరిన్ని వివరాలను అందించింది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది అని, ఇది బాలీలోని జాగరాగా గ్రామంలో ఉందని ఆ వెబ్సైటులో పేర్కొన్నారు. 1848లో డచ్ వలస దళాలకు వ్యతిరేకంగా బలినీసులు చేసిన పోరాటంలో ఈ ఆలయం కీలక పాత్ర పోషించింది. శివునికి అంకితమైన ఈ ఆలయం, బలినీసు జీవితం, పురాణాలను ప్రతిబింబించే ప్రత్యేకమైన శిల్పాల కోసం ప్రసిద్ధి చెందింది. ఇది సింగరాజా నగరానికి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్న చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశం.

అంతే కాదు, ఈ ఆలయం మొదలు 12వ శతాబ్దంలో నిర్మించబడింది అయినప్పటికీ, 1848 యుద్ధం సమయంలో ధ్వంసమైంది. 1865లో దీన్ని పునర్నిర్మించిన్నప్పుడు ఆలయ గోడలపై ఆధునిక ఆవిష్కరణలు అయిన కారు, విమానాలు, సైకిల్ మొదలైనవి చెక్కారు (ఇక్కడ , ఇక్కడ). అంటే ఈ శిల్పాలు సుమారు 150 సంవత్సరాల పాతవే.

వీడియో చివరి భాగంలో, ఈ ఆలయం 1865లో పునర్నిర్మించబడిందని మరియు శిల్పాలు సుమారు 150 సంవత్సరాల పాతవే అయినట్లుగా అక్కడి టూరిస్ట్ గైడ్ చెప్పడం చూడొచ్చు.

చివరగా, ఈ వీడియోలో కారు చెక్కడాలు ఇండోనేషియా ఆలయంలోనివి; ఇవి 1865లో చెక్కారు, 800 ఏళ్ళ క్రితం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll