Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ కుకి మహిళ తాము పాపి సాగు చేస్తామని బహిరంగంగా మీడియాతో చెప్తున్న దృశ్యాలని అంటున్నారు

0

మేము రైతులం. కొండలలో పాపి (నల్లమందు తయారీకి ఉపయోగించే గసగసాలు) సాగు చేస్తుంటాం, దీంట్లో ప్రభుత్వానికి ఏంటి సమస్య”, అని ఒక క్రైస్తవ కుకి మహిళ బహిరంగంగా మీడియాతో ఒప్పుకున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతుంది. మైతేయ్ హిందువులతో ఇక కలిసి ఉండేది లేదని, మాకు వేరే రాష్ట్రమో లేదా దేశమైనా ఇచ్చేయాలని కుకి మిలిటెంట్ మీడియాతో మాట్లాడిన దృశ్యాలంటూ మరొక వీడియో క్లిప్పుని కూడా ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్ కొండల్లో తాము పాపి (నల్లమందు తయారీకి ఉపయోగించే గసగసాలు) సాగు చేస్తామని ఒక క్రైస్తవ కుకి మహిళ బహిరంగంగా మీడియాతో మాట్లాడిన దృశ్యాలు.  

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్ చేయబడినది. పూర్తి వీడియోలో, మణిపూర్ కొండ లోయల్లో ఒకప్పుడు పాపి సాగు జరిగేదని, 2021 తరువాత కుకి కమ్యూనిటి పాపి సాగును పూర్తిగా ఆపేసినట్టు గ్రేస్ హాకీ అనే మహిళ మీడియాకు తెలిపింది. మణిపూర్ కొండలలో ఇంకా పాపి సాగు జరుగుతున్నట్టు వీడియోలోని మహిళ తెలుపలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియోపై “Mai Bhi Bharath” అనే వాటర్ మార్క్ ఉండటాన్ని గమనించి ఈ వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని “Mai Bhi Bharath” యూట్యూబ్ ఛానెల్లో 26 జులై 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మణిపూర్ రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టేందుకు కుకీలు పాపి (నల్లమందు తయారీకి ఉపయోగించే గసగసాలు) సాగు చేస్తున్నారన్న ఆరోపణలను గ్రేస్ హాకీ తోవసిపుచ్చారని ఈ వీడియో వివరణలో తెలిపారు.

మణిపుర్‌లో మైతేయ్ కమ్యూనటితో తలపడేందుకు కావాలిసిన ఆయుధాలను, డబ్బును కుకి టెర్రరిస్టులు సరఫరా చేస్తున్నారనే వాదన, అలాగే, మణిపుర్‌ రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టేందుకు కుకీలు పాపి (నల్లమందు తయారీకి ఉపయోగించే గసగసాలు) సాగు చేస్తున్నారని చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని వీడియోలోని మహిళ తెలిపారు.

మణిపూర్ కొండలలో 2021 ముందు వరకు పాపి సాగు జరిగిన మాట వాస్తవం. నేను ‘నశా ముక్త్ భారత్’ ప్రచారంలో పనిచేశాను. ఒకప్పుడు తమ జీవనోపాధి మెరుగుపరుచుకొనేందుకు ఇక్కడి కుకి ప్రజలు పాపి సాగును ఒక ప్రత్యామ్నాయ ఆదాయంగా చూసేవారు. ఒకప్పుడు పాపి సాగు చేసినవారిని మేము ఇటీవల కలిసినప్పుడు వారు అరటిపండు, కాలీఫ్లవర్ వంటి పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 99.9 శాతం పాపి సాగును ఇక్కడి ప్రజలు ఆపేశారు,” అని గ్రేస్ హాకీ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూ వీడియోని ఎడిట్ చేసి పోస్టులోని వీడియోని రూపొందించారని పై వివరాల ఆధారంగా చెప్పవచ్చు.

పోస్టులో షేర్ చేసిన మరో వీడియో క్లిప్ కూడా “Mai Bhi Bharath” యూట్యూబ్ ఛానెల్ పబ్లిష్ చేసిన మరొక వీడియోలో దొరికింది. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి, “మేము మళ్ళీ మైతేయ్ కమ్యూనిటితో కలిసి జీవించే ప్రసక్తే లేదు. మేము వారి నుంచి పూర్తిగా విడిపోవాలని అనుకుంటున్నాం. మణిపూర్‌లో మాకు ప్రత్యేక పరిపాలన కావాలి,” అని ఇంటర్వ్యూలో తెలిపారు. వారికి ప్రత్యేక దేశం కావాలని వీడియోలోని వ్యక్తి ఎక్కడ అనలేదు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ కుకి మహిళ తాము పాపి సాగు చేస్తామని బహిరంగంగా మీడియాతో చెప్తున్న దృశ్యాలంటూన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll