Fake News, Telugu
 

భారత సైన్యంలో “ముస్లిం రెజిమెంట్” అనే విభాగం లేదు; ఈ పేరుతో ప్రచారంలో ఉన్న కథనాలు అవాస్తవం

0

భారత సైన్యంలో ‘ముస్లిం రెజిమెంట్’ ఇప్పుడు ఎందుకు లేదో కారణాలు వివరిస్తున్న ఒక పోస్టు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్ : 1965 వరకు భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ ఉంది. 1965లో దీనిని రద్దు చేశారు, అందుకు రెండు ప్రధాన కారణాలు. 1) 1947లో భారత సైన్యంలో ఉన్న కొందరు ముస్లిం సైనికులు, తమ సొంత బెటాలియన్లో ఉన్న వీర్ గూర్ఖా సైనికులని చంపారు  2) 1965లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో ముస్లిం రెజిమెంట్లో సైనికులు పాకిస్తాన్‌తో పోరాడేందుకు నిరాకరించారు.

ఫ్యాక్ట్ (నిజం): ముస్లిం రెజిమెంట్ గురించి తప్పుడు వార్తలు ఎక్కువగా  ప్రచారం అవుతుండటంతో భారత మాజీ సైనికాధికారులు 14 అక్టోబర్ 2020లో భారత రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ‘ముస్లిం రెజిమెంట్’ అనే విభాగం భారత సైన్యంలో 1965  లేదా అంతకంటే ముందు లేనేలేదు అని స్పష్టం చేశారు. రక్షణ శాఖ, ఆర్మీ, ఆర్కైవ్ వెబ్సైట్లలో కూడా ‘ముస్లిం రెజిమెంట్’కు సంబంధించిన ఎటువంటి సమాచారము లేదు. అందువలన, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, భారతదేశం సైన్యంలో 1965కి ముందు ముస్లిం రెజిమెంట్ ఉందో లేదో ఇంటర్నెట్లో వెతకగా, కొన్ని వార్తా కథనాలు దొరికాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ వార్తా కథనాల ప్రకారం, భారత సైన్యంలో ‘ముస్లిం రెజిమెంట్’ అనే పేరుతో ఎటువంటి రెజిమెంట్ లేదు. కులం మరియు మతం ఆధారంగా రెజిమెంట్లు బ్రిటీష్ కాలంలో ఏర్పడ్డాయి లేదా ఇవి జమ్మూ మరియు కాశ్మీర్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ వంటి రాచరిక సైన్యంగా పనిచేసే సైన్యాలు. ఈ రెజిమెంట్ జమ్మూ మరియు కాశ్మీర్ రాచరిక రాష్ట్రానికి చెందిన సైన్యం. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ ముస్లిం రెజిమెంట్ యొక్క వాదనలపై ఇది తప్పుడు ప్రచారమని మరియు గత 200 సంవత్సరాలుగా భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ లేదని చెప్పారు. అలాగే, బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి బలూచ్ మరియు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్లతో పాటు సిక్కు, పంజాబ్, గర్వాల్ వంటి రెజిమెంట్లు ఉన్నాయి, దేశ విభజన తర్వాత, బలూచ్ మరియు ఫ్రాంటియర్ రెజిమెంట్లు పాకిస్తాన్‌కు వెళ్లాయి మరియు పంజాబ్ రెజిమెంట్ పాకిస్తాన్‌లో మరియు భారతదేశంలో కూడా ఉంది” అని ఆయన చెప్పారు.ఇక ‘ముస్లిం రెజిమెంట్’ గురించి తప్పుడు వార్తలు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో దేశ భద్రత దృష్ట్యా భారత సైన్యంలో వివిధ హోదాల్లో పని చేసిన 120 మంది మాజీ సైనికాధికారులు భారత రాష్ట్రపతికి 14 అక్టోబర్ 2020లో ఒక లేఖ రాశారు. ఈ లేఖను ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన  వార్తను ఇక్కడ చూడవచ్చు.

ఈ లేఖలో ‘ముస్లిం రెజిమెంట్’ అనే విభాగం భారత సైన్యంలో 1965  లేదా అంతకంటే ముందు లేనేలేదు అని స్పష్టం చేశారు. ఇక భారత ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఆర్కైవ్, రక్షణ శాఖ, ఆర్మీ వెబ్‌సైట్లలో కూడా ముస్లిం రెజిమెంట్ కు సంబంధించిన ఎటువంటి సమాచారము లేదు. అందువలన, 1965లో ముస్లిం రెజిమెంట్ రద్దు చేశారు అన్న వార్తలో నిజం లేదు. మరియు, రద్దు చేయడానికి పోస్టులో చెప్పిన కారణాలు కూడా కల్పిత కథలు అని స్పష్టం అవుతుంది.

చివరిగా, భారత సైన్యంలో ‘ముస్లిం రెజిమెంట్’ అనే విభాగం అసలు ఎప్పుడూ లేదు. ఈ పేరుతో ప్రచారంలో ఉన్న కథనాలు అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll