విజయవాడ ఇంద్రకీలాద్రి శిఖరంపై ఇటీవల ఒక క్రీస్తు శిలువని ఏర్పాటు చేశారని, ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఇక్కడ మేరీ మాత మందిరం కూడా కడతారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇటీవల ఏర్పాటు చేసిన క్రీస్తు శిలువ యొక్క దృశ్యాలు.
ఫాక్ట్: వీడియోలో కనిపిస్తున్న శిలువ విజయవాడలోని గుణదల కొండపై ఉన్న “గుణదల మేరీ మాత చర్చి”కి సంబంధించినది. ఇక్కడ మేరీ మాతని 1925 నుంచే ప్రార్థించడం జరుగుతోంది. 1933లో గుణదల కొండపైన శిలువని ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తి స్థాయి చర్చిగా 1971లో అభివృద్ది చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, వైరల్ వీడియోలో చెప్పినట్లుగా ఇంద్రకీలాద్రిపై ఏదైనా చర్చి కానీ క్రీస్తు శిలువని కానీ ఇటీవల ఏర్పాటు చేశారా అనే విషయంపై ఇంటర్నెట్లో వెతకగా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.
ఇక వీడియో కనిపిస్తున్న శిలువ ఉన్న ప్రదేశం విజయవాడలో ఎక్కడ ఉందోనని వెతకగా, అది గుణదల కొండపైన ఉన్న “గుణదల మేరీ మాత చర్చి”లో ఒక భాగమని తెలిసింది. ఈ శిలువ ఇంద్రకీలాద్రి కొండపై లేదు. ఇది గుణదల కొండ అనే మరొక కొండపైన ఉంటుంది.
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గ ఆలయానికి, గుణదల కొండపైన ఉన్న ఈ శిలువకి కనీసం 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పైగా, గుణదల కొండపైన మేరీ మాతని 1925 నుంచే ప్రార్థించడం జరుగుతోంది. 1933లో గుణదల కొండపైన శిలువని ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తి స్థాయి చర్చిగా 1971లో అభివృద్ది చేశారు.
ఇక వీడియో తీసిన వ్యక్తి ఉన్న ప్రదేశం “ మొగల్రాజపురం దుర్గాదేవి ఆలయం” అని గుర్తించాం. ఈ గుడి కూడా ఇంద్రకీలాద్రిపై ఉండదు. ఇది గుణదల కొండ సమీపంలోనే ఉండడం వలన, ఆ కొండపైన ఉన్న శిలువ ఇక్కడికి కనిపిస్తుంది.
చివరిగా, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శిలువని ఏర్పాటు చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.