Fake News, Telugu
 

ఈ ఫొటోలో ఉన్నది ప్యూన్‌గా పని చేస్తూ తన కొడుకులని చదివించుకున్న సుమిత్రా దేవీ కాదు

0

బీహార్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేసిన సుమిత్రా దేవి అనే వ్యక్తి  ఫోటో అని చెప్తూ ఒక మహిళ బకెట్ పట్టుకొని నిలబడి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. పోస్ట్‌లో ఉన్న వివరణ ప్రకారం, సుమిత్రా దేవి పదవీ విరమణ వేడుకకు, సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న ఆమె ముగ్గురు కుమారులు హాజరయ్యారు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క వాస్తవికతను తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: ఈ ఫోటోలో ఉన్న మహిళ సుమిత్రా దేవి. ఈమె బిహార్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్ ఉద్యోగం పనిచేసి రిటైర్ అయింది, ఆమె పదవీ విరమణ వేడుకకు, సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న ఆమె ముగ్గురు కుమారులు హాజరయ్యారు

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోతో కూడిన కథనం పాక్షికంగా నిజం అయినప్పటికీ (సుమిత్రా దేవి జార్ఖండ్‌లో ప్యూన్/స్వీపర్ ఉద్యోగం చేసారు, బీహార్‌లో స్వీపర్ కాదు), ఫోటో సుమిత్రా దేవికి చెందినది కాదు. ఇది బ్రిటిష్ ఇండియాకు చెందిన ఒక స్వీపర్‌ని చూపుతుంది. కావున పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

ఈ ఫోటో మరియు పోస్టులో ఉన్న కథనం గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి, మొదటిగా మేము తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకడం జరిగింది. ఈ సెర్చ్ ద్వారా, ఈ సంఘటనకు చెందిన 2016 నాటి కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

కానీ వైరల్ అవుతున్న కథకి ఈ వార్తా కథనాల్లో ఉన్న కథకి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. 2016లో సుమిత్ర దేవి అనే ప్రభుత్వ ప్యూన్/ స్వీపర్ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినప్పుడు, తన ముగ్గురు కుమారులు వచ్చారు. వాళ్ళు ముగ్గురూ మంచి స్థానాల్లో ఉన్నారని రిపోర్టులు పేర్కొన్నాయి. ఒకరు డాక్టరుగా, ఒకరు ఇంజనీరుగా మరియు ఇంకొకరు కలెక్టరుగా (మహేంద్ర కుమార్) పనిచేస్తున్నారు. సుమిత్ర దేవి ఝార్ఖండ్లోని Central Coalfields Limited (CCL) రాజ్‌రప్పా టౌన్‌షిప్‌లో ప్యూన్/స్వీపర్‌గా పనిచేసే వారు, పోస్టులో చెప్తున్నట్టు బీహార్లో కాదు.  

వైరల్ పోస్టులో ఉన్న ఫోటో సుమిత్ర దేవికు చెందినదో కాదో అని తెలుసుకోవటానికి, ఆ ఫోటోని గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇది అమెరికాలో ఉన్న లూసియానా స్టేట్ యూనివర్సిటీ వారి వెబ్సైటులో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ ఫోటో ఎక్జిబిట్‌లో లభించింది. ఇందులో ఉన్న “లైఫ్ ఇన్ బంగ్లాస్” అనే సెక్షన్‌లో ఈ ఫోటో ఉంది. ది స్వీపర్ ఉమన్ అని ఈ ఫోటో కింద ఒక వివరణ ఉంది. ఇదే ఫోటో ఓల్డ్ ఇండియన్ ఫొటోస్` అనే వెబ్సైట్ మరియు ఓల్డ్ ఫొటోస్ అఫ్ బాంబే అనే బ్లాగులో కూడా ఉంది. ఈ ఆధారాల్ని బట్టి ఈ ఫోటో బ్రిటిష్ కాలం నాటిదని, సుమిత్ర దేవిది కాదు అని తెలుస్తుంది. 

చివరిగా, బ్రిటిష్ కాలం నాటి ఒక స్వీపర్ ఫోటోని సుమిత్ర దేవి ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll