భూటాన్ ప్రభుత్వం తమ దేశానికి విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఎటువంటి పన్నులు లేకుండా(డ్యూటీ ఫ్రీ) బంగారాన్ని అర్హులైన విదేశీయులకు విక్రయిస్తుందని, దీని ద్వారా భారతీయ పర్యాటకులు భారత్‌లో కంటే దాదాపు 50% తక్కువ ధరకే భూటాన్లో బంగారాన్ని కొని భారత్‌కు తెచ్చుకోవచ్చని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: భూటాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం ద్వారా భారతీయ పర్యాటకులు దాదాపు 50% ధరకే భూటాన్లో బంగారాన్ని కొనుక్కోవచ్చు.
ఫాక్ట్: 07 ఆగస్టు 2023 నాటికి భారత్‌లో 10 గ్రాములు బంగారం ధర సుమారు ₹59,000 ఉండగా, భూటాన్లో దీని విలువ భారత కరెన్సీ ప్రకారం ₹54,000 గా ఉంది. పైగా, ఈ బంగారాన్ని కొనాలంటే భూటాన్ విధించే Sustainable Development Fee మరియు ఆ దేశ ప్రభుత్వ గుర్తింపు పొందిన హోటళ్లలో బస చెయ్యాలి. ఇక భారత్‌కు బంగారాన్ని మోతాదుకు మించి దిగుమతి చేసుకోవాలంటే దిగుమతి సుంకంతో పాటు వివిధ పన్నులు కట్టవలసి ఉంటుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, భారత్(INR) మరియు భూటాన్(BTN) కరెన్సీ ఎక్స్ఛేంజి రేట్లకు అనుగుణంగా, 07 ఆగస్టు 2023 నాటికి రెండు దేశాలలో అధికారిక బంగారు ధరలను(24k) ఈ క్రింది పట్టిక ద్వారా చూడవచ్చు. అయితే భారత్‌లో 14,18,20,22& 24 క్యారెట్ల నాణ్యత గల బంగారాన్ని విక్రయిస్తుండగా, భూటాన్ అధికారిక వెబ్‌సైట్లు మాత్రం బంగారు నాణ్యత వివరాలను వెల్లడించలేదు.
దేశం | 10 గ్రా. బంగారు ధర (₹ లలో) |
భారత్ | ~ ₹59,000* |
భూటాన్ | ~ ₹54,000* |
ఈ గణాంకాలను బట్టి భూటాన్లో బంగారం ధర వైరల్ వీడియోలో చెప్పినట్లుగా ₹26,000 కాదని స్పష్టమవుతుంది.
ఇక భూటాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం విషయానికి వస్తే, భూటాన్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మార్చి 2023 నుంచి ఆ దేశ ప్రభుత్వం పరిమిత పరిమాణాలలో డ్యూటీ ఫ్రీ బంగారాన్ని అర్హులైన విదేశీ పర్యాటకులకి విక్రయించే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన అర్హతలను క్రింద చూడవచ్చు:
- Sustainable Development Fee (SDF) కట్టే పర్యాటకుడై ఉండాలి. భారతీయ పర్యాటకులకు ఈ ఫీజు రోజుకు ఒక్కొక్కరికి ₹1,200 ఉంటుంది.
- కనీసం ఒక్క రాత్రి అయినా భూటాన్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన హోటల్లలో బస చెయ్యాలి.
- బంగారాన్ని అమెరికన్ డాలర్లలో మాత్రమే కొనాలి.
అయితే కస్టమ్స్ నిబంధనల ప్రకారం, ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉండి తిరిగి వస్తున్న భారతీయులు, పురుషులైతే 20 గ్రాములు (₹50,000 లోపు), స్త్రీలైతే 40 గ్రాములు (₹ లక్ష లోపు), కస్టమ్స్ డ్యూటి లేకుండా భారత్‌కు బంగారాన్ని తెచ్చుకోవచ్చు.
అయితే, ఈ పరిమితికి మించి బంగారాన్ని విదేశాలనుంచి తెచ్చుకున్నట్లయితే 15-38.5% వరకు దిగుమతి సుంకాన్ని మరియు ఇతర పన్నులు కట్టాల్సి ఉంటుంది.
చివరిగా, భూటాన్ ప్రభుత్వం విదేశీ పర్యాటకులకోసం ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా భారతీయలు బంగారాన్ని కొనుగోలు చేస్తే 50% డిస్కౌంట్ వస్తుంది జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.