Fake News, Telugu
 

రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ ఘర్షణలలో నష్ట పోయిన అన్ని మతాల బాధితులకి నష్ట పరిహారం అందించింది

0

ఇటీవల రాజస్థాన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన (రోడ్ రేజ్) ఘర్షణలో చనిపోయిన ఇక్బాల్ కుటుంబానికి ప్రభుత్వం అఘా మేఘాల మీద స్పందించి, యాభై లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, పాల బూత్ ఇచ్చిందని చెప్తున్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అక్కడి ప్రభుత్వం ఒక వర్గం (ముస్లిం) ప్రజలకు సంబంధించిన విషయంలోనే ఇలా వేగంగా స్పందిస్తుందని, ఇతర వర్గాల ప్రజల విషయాలలో ఇలా స్పందించట్లేదనే ఉద్దేశంలో ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ముస్లింలకు పరిహారం చెల్లించే విషయాల్లో స్పందిస్తుంది, అదే హిందువులకు సంబంధించిన విషయాల్లో వేగంగా స్పందించట్లేదు.

ఫాక్ట్(నిజం):  రాజస్తాన్ ప్రభుత్వం అనేక సందర్భాలలో కులమతాలకు అతీతంగా నష్టపరిహారం చెల్లించిన ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహారణకు గత సంవత్సరం ఇద్దరు ముస్లిం వ్యక్తుల చేత చంపబడ్డ కన్హయ్య లాల్ అనే టైలర్‌ కుటుంభానికి 50 లక్షల నష్ట పరిహారం మరియు అతని ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించింది. అంతేకాకుండా ఈ హత్య తరవాత పారిపోతున్న ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో సహకరించిన ఇద్దరు హిందూ వ్యక్తులకు కూడా అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. అమలులో ఉన్న రూల్స్‌కు సవరణలు చేసి మరి ప్రభుత్వం వీరికి ఉద్యోగాలు అందించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సెప్టెంబర్ 2023లో జైపూర్‌లోని శుభాష్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వాహనాలకు అయిన ప్రమాదం, అపార్థం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణల్లో ఇక్బాల్ అనే 17 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించింది. చనిపోయిన ఇక్బాల్ కుటుంభానికి 50 లక్షల నష్ట పరిహారం అందించింది. దీనికి సంబంధించిన చెక్ కూడా ఆ కుటుంబానికి అందించింది. అలాగే ఇక్బాల్ సోదరుడికి కాంట్రాక్టు ఉద్యోగం మరియు అతని తండ్రికి డైరీ బూత్ కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇక్బాల్ కుటుంబానికి పరిహారం అందించిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఇతర మతాల విషయంలో పక్షపాతం చూపిస్తుందని వార్తలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఐతే రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిహారం అందించే విషయంలో కులమతాలకు అతీతంగా వ్యవహరించిన ఉదాహరణలు ఉన్నాయి.

రాజస్థాన్ ప్రభుత్వం హిందువులకు కూడా నష్టపరిహారం అందించింది:

ఉదాహారణకి గత సంవత్సరం మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఫేస్‌బుక్‌లో షేర్ చేసినందుకు ఉదయపూర్కి చెందిన కన్హయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు చంపిన ఘటనకు సంబంధించి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కన్హయ్య లాల్ కుటుంభానికి 50 లక్షల నష్ట పరిహారం మరియు అతని ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించింది.

అంతేకాకుండా ఈ హత్య తరవాత పారిపోతున్న ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో సహకరించిన ఇద్దరు హిందూ వ్యక్తులకు కూడా అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. అమలులో ఉన్న రూల్స్‌కు సవరణలు చేసి మరి ప్రభుత్వం వీరికి ఉద్యోగాలు అందించింది.

ఇంతేకాకుండా 2022లో జోధ్‌పూర్ & కరౌలి మత ఘర్షణ సమయాల్లో కూడా రాజస్థాన్ ప్రభుత్వం మతాలకు అతీతంగా నష్ట పరిహారం చెల్లించింది. 2020లో జరిగిన బస్సు ఆక్సిడెంట్ బాధితులకు కూడా అక్కడి ప్రభుత్వం కులమతాలకు అతీతంగా పరిహారం చెల్లించింది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పరిహారం అందించే విషయంలో రాజస్తాన్ ప్రభుత్వం ముస్లింల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ సంవత్సరంలోనే ఆవుల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపనలతో జునైద్ & నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులను కొందరు హిందువులు చంపేసిన ఘటనలో ప్రభుత్వం ఈ ఇద్దరి కుటుంబానికి కేవలం 15 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చిందని, ప్రభుత్వం ముస్లింల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిబట్టి రాజస్తాన్ ప్రభుత్వం పరిహారం అందించే విషయంలో ముస్లిముల పట్ల పక్షపాతం చూపిస్తుందన్న వాదనలో నిజంలేదని స్పష్టమవుతుంది.

చివరగా, నష్ట పరిహారం అందించే విషయంలో రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll