Fake News, Telugu
 

వేడి పైనాపిల్ నీళ్లు తాగడం వల్ల క్యాన్సర్ నయమవుతుందని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు

0

వేడి పైనాపిల్ నీటిని క్యాన్సర్  కణాలను చంపే ఔషధంగా సూచిస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. పొస్ట్‌లో  ‘.. వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి. .. ’ అని రాసి ఉంది. ఇలాంటి పోస్ట్ మరోటి  ఆంగ్లంలో కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  ఇందులోని  నిజానిజాలు ఎంతో  ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము.

క్లెయిమ్: వేడి పైనాపిల్ నీటికి కాన్సర్ కణాలను నాశనం చేసే గుణం ఉంది.

ఫాక్ట్: పైనాపిల్-వెనిగర్ మరియు అందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైముకి క్యాన్సర్ కణాలపైన ప్రభావం చూపే గుణం ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధనలో తేలినా, అవి ల్యాబ్‌లో ఎలుకలపైనా చేసిన ప్రయోగాలు మాత్రమే. మనుషులలో కాన్సర్ కణాలపై వీటి ప్రభావం ఉన్నట్లు ఎటువంటి శాస్త్రీయ రుజువు లేదు. కాబట్టి ఈ పొస్ట్‌లో చెప్తున్న విషయం  తప్పుదోవ పట్టించేలా ఉంది.

పైనాపిల్‌కి క్యాన్సర్ కణాలను చంపే గుణాల ఉన్నాయా అని దీనిపై జరిగిన పరిశోధనల గురించి వెతికితే, ఎన్‌సిబిఐ వారి  వెబ్సైటులో రెండు రీసెర్చ్ పేపర్స్ లభించాయి. ఒక పరిశోధనలో పైనాపిల్-వెనిగర్ కాన్సర్ పైన ప్రభావం చూపుతుంది అని తేలగా, మరొక పరిశోధనలో పైనాపిల్‌లో లభించే  బ్రోమెలైన్ ఎంజైముకి క్యాన్సర్ కణాలపైన ప్రభావం చూపే గుణం ఉన్నట్లు తెలిసింది. వీటిని ఇక్కడ మరియి ఇక్కడ చదవచ్చు. కానీ, ఈ రెండు పరిశోధనలు ల్యాబ్‌లో ఎలుకలపై చేసారు, మనుషుల కాన్సర్ కణాల మీద  పైనాపిల్ యొక్క ప్రభావం ఎంత అనేది ఇందులో చెప్పలేదు. అలాంటి పరిశోధనల కోసం ఇంటర్నెట్‌లో వెతుకగా ఎటువంటి సంభందిత ఆధారాలు లభించలేదు.

ఏఎఫ్‌పి (AFP) వారు క్యాన్సర్‌ని తగ్గించడంలో వేడి పైనాపిల్ నీరు ప్రభావం చూపుతుంది అనడంలో ఎటువంటి రుజువు లేదు అని చెప్తూ ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసారు. డా. రేమండ్ చాంగ్ అనే క్యాన్సర్‌ స్పెషలిస్ట్ ఏఎఫ్‌పి వారితో మాట్లాడుతూ ‘క్యాన్సర్ కణాల మీద పైనాపిల్ యొక్క ఎఫెక్ట్స్, టెస్ట్ ట్యూబ్ స్టడీస్ ఆధారంగా చెప్పబడుతున్నాయి’ అని అన్నారు.

మనం ల్యాబ్‌లో చేసే ప్రయోగాలకి, వైద్యసంబంధమైన వాస్తవికతకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి అని అన్నారు. సహజంగా దొరికే చాలా పదార్ధాలు కృత్రిమ లాబరేటరీ వాతావరణంలో  క్యాన్సర్ కణాల్ని చంపుతాయి కానీ  అవి ఆచరణలో మనుషులపై పనిచేయవు అని చెప్పారు.

ఇండోనేషియా క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అరు విసాక్సోనో సుడోయో మాట్లాడుతూ క్యాన్సర్‌కు చికిత్సగా పైనాపిల్‌ను ఉపయోగించడాన్ని సమర్ధించే ఆధారాలు లేవు అని అన్నారు.

‘వెబ్ఎండి’ వారు రాసిన ‘మీకు క్యాన్సర్ ఉన్నప్పుడు తినవలసిన పండ్లు’ అనే అర్టికల్‌లో క్యాన్సర్ నివారణలో పైనాపిల్‌లోని  బ్రోమెలైన్ అనే ఎంజైమ్ యొక్క పాత్ర ఎంత ఉంది అనే దాని పై తొలి దశ పరిశోధనలు జరుగుతున్నాయి అని, ఈ కెమికల్స్ ప్రభావం ఎంత అనేది ఇంకా తెలియదు అని రాసారు.

వీటన్నిటిని పక్కనబెడితే, అన్ని పండ్లు లాగే పైనాపిల్ తినడం వల్ల  కూడా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు. కానీ పొస్ట్‌లో చెప్తున్నట్లు  వేడి పైనాపిల్ నీళ్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది అనడంలో ఎటువంటి రుజువు లేదు.

చివరిగా, వేడి పైనాపిల్ నీళ్లు  తాగడం వల్ల క్యాన్సర్ నయమవుతుందని నిరూపించడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll