Fake News, Telugu
 

2020 ఢిల్లీ అల్లర్ల వీడియోని ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసిన ముస్లింలతో సైనికులు జాతీయ గీతం పాడిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

రాజస్థాన్‌కి చెందిన కొంతమంది ముస్లిం యువకులు కాశ్మీర్ తిరగడానికి వెళ్లి అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ భారతదేశాన్ని హిందూ దేశంగా ఉండనివ్వం అని పెద్దపెద్దగా అరుపులు అరుస్తూ ఉంటే, వాళ్ల చుట్టుపక్కల డ్యూటీ చేస్తున్న సైనికులు వాళ్లను ఒక ఉతుకు ఉతికి వారి చేత భారతమాతకు జై కొట్టించారు”, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: కాశ్మీర్లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన రాజస్థాన్‌కు చెందిన ముస్లింలతో సైనికులు భారత జాతీయ గీతం పాడిస్తున్న దృశ్యాలు. 

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఢిల్లీ పోలీసులు కొంత మంది CAA వ్యతిరేక నిరసనకారులపై లాఠీ చార్జ్  చేసి వారితో బలవంతంగా జాతీయ గీతాన్ని పాడించిన దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఫైజాన్ అనే యువకుడు తర్వాత గాయాల కారణంగా మరణించాడు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు కాశ్మీర్‌కు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.    

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోలని షేర్ చేస్తూ 2020లో పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఢిల్లీ పోలీసులు కొందరు CAA వ్యతిరేక నిరసనకారులను కొట్టి వారి చేత బలవంతంగా జాతీయ గీతాన్ని పాడిస్తున్న చిత్రాలని ఈ వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేశాయి.

2020 ఫిబ్రవరి నెలలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఫైజాన్ అనే 23 ఏళ్ల యువకుడు పోలీసుల లాఠీ దెబ్బల గాయాలతో మరణించినట్టు జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్ ద్వారా తెలిపింది. బాధితుడి తల్లి ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తూ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ఈ కేసుని దర్యాప్తు చేయించాలని హైకోర్టుని కోరింది. ఈ కేసు విచారణకు సంబంధించి ‘ది ప్రింట్’ వార్తా సంస్థ 2021 జనవరి నెలలో పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతూ ఉంది. 2022 జనవరి నెలలో జరిగిన హియరింగ్‌లో, ఫైజాన్ మృతిపై అప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి హియరింగ్ 08 సెప్టెంబర్ 2022 నాడు జరగనుంది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, కాశ్మీర్లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చెసినందుకు జవాన్లు భారత జాతీయ గీతం పాడిస్తున్న దృశ్యాలు కావని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వీడియోని కాశ్మీర్లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన ముస్లింలతో సైనికులు భారత జాతీయ గీతాన్ని పాడిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll