చత్రపతి శివాజీ మరియు అంబేద్కర్ ఇద్దరు మహార్ సామాజిక వర్గానికి చెందినవారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పైగా ఈ పోస్టులో ‘మహార్’ మరియు ‘రాష్ట్ర’ వల్ల మహారాష్ట్రకు ఆ పేరు వచ్చిందని కూడా చేఫ్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: చత్రపతి శివాజీ మరియు అంబేద్కర్ ఇద్దరు మహార్ సామాజిక వర్గానికి చెందినవారు.
ఫాక్ట్ (నిజం): అంబేద్కర్ 1891లో దళిత సామాజిక వర్గానికి చెందిన మహార్ కులంలో జన్మించగా, చత్రపతి శివాజీ 1627లో మరాఠా సామాజిక వర్గానికి చెందిన కుంబి కులంలో ఒక రైతు కుంటుంబంలో లో జన్మించాడు. చత్రపతి శివాజీ మహార్ అనడానికి అధికారిక సమాచారమేది లేదు. అలాగే మహార్ సామాజిక వర్గం నుండి మహారాష్ట్రకు ఆ పేరు వచ్చిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మహారాష్ట్ర అనే పేరు ఎలా వచ్చింది?
మహారాష్ట్ర అనే పేరును మొదటిసారిగా చైనా యాత్రికుడు హువాన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో రాసిన శాసనంలో ప్రస్తావించారు. ఐతే మహారాష్ట్ర అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై అనేక సిద్దంతాలు ఉన్నప్పటికీ, మహార్ సామాజిక వర్గం నుండి మహారాష్ట్రకు ఆ పేరు వచ్చిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సాధారణంగా మహారాష్ట్ర పేరుకు సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కొన్ని సిద్దాంతాలను కింద చూద్దాం.
- మహారాష్ట్ర అనేది సంస్కృత పదం నుండి ఉద్భవించింది. ‘మహా’ అంటే ‘గొప్ప’ మరియు ‘రాష్ట్రం’ అంటే ‘దేశం’ (ఇక్కడ, ఇక్కడ).
- మహారథి (గొప్ప రథసారధి) అనే పదం నుండి మహారాష్ట్ర అనే పేరు వచ్చింది (ఇక్కడ).
చత్రపతి శివాజీ, అంబేద్కర్ ఇద్దరు మహార్ సామాజిక వర్గానికి చెందినవారు ?
అంబేద్కర్ 1891లో దళిత సామాజిక వర్గానికి చెందిన మహార్ కులంలో జన్మించిన విషయం తెలిసిందే. అధికారిక సమాచారం కూడా ఇదే చెప్తుంది. ఐతే చివరి రోజుల్లో అతను బౌద్ద మతాన్ని స్వీకరించాడు.
ఇకపోతే చత్రపతి శివాజీ 1627లో మరాఠా సామాజిక వర్గానికి చెందిన ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. శివాజీ తండ్రి షాజీ భోంస్లే మరాఠా సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, అతని తల్లి జీజాబాయి యాదవ కులానికి చెందినది.
సాధారణంగా మరాఠాలు అనేది రైతులు, భూస్వాములు మరియు యోధులతో కూడిన కులాల సమూహం. ఇందులో వ్యవసాయాధారిత వారు కుంబి అనే ఉప కులానికి చెందుతారు. శివాజీ కూడా ఈ కుంబి కులానికి చెందినవాడు. అధికారిక సమాచారం కూడా ఇదే చెప్తుంది (ఇక్కడ).
ఆ కాలంలో మహార్ మరియు మరాఠా రెండు కులాలను కూడా శూద్రుల కిందే పరిగణించేవారు. ఐతే శివాజీ ఉన్నత స్థాయి మరాఠా కులానికి చెందినవాడు కాదు కాబట్టి రాజు కావడానికి అర్హత లేని కారణంగా, అతను పట్టాభిషేకం సమయంలో బ్రాహ్మణుల సహాయంతో క్షత్రియగా ప్రకటించుకున్నాడు.
ఐతే చత్రపతి శివాజీ ఏ కులానికి చెందినవాడనే విషయంపై పలు రకాల చర్చలు జరుగుతున్నప్పటికీ శివాజీ మహార్ అనడానికి అధికారిక సమాచారం ఏది లేదు.
చివరగా, చత్రపతి శివాజీ, అంబేద్కర్ ఇద్దరు మహార్లు అనడానికి అధికారిక సమాచారమేది లేదు.