19 ఏళ్ల నుండి వెతుకుతున్న అలీఘర్ పేలుళ్ళ సూత్రదారి అయిన SIMI ఉగ్రవాది అబ్దుల్లా ధానిష్ ఇప్పుడు ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఆందోళనల్లో దొరికాడని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 19 ఏళ్ల నుండి వెతుకుతున్న అహ్మదాబాద్ పేలుళ్ళ సూత్రదారి అయిన SIMI ఉగ్రవాది అబ్దుల్లా ధానిష్ ఇప్పుడు ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఆందోళనల్లో దొరికాడు.
ఫాక్ట్(నిజం): SIMI ఉగ్రవాది అయిన అబ్దుల్లా ధానిష్ అరెస్ట్ కి సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో గాని, ఈ వార్తని ప్రచురించిన వార్తా కథనాల్లో మరియు న్యూస్ వీడియోల్లో గాని ఎక్కడా కూడా ఇతనిని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనల్లో పాల్గొన్నప్పుడు పట్టుకున్నట్టు తెలుపలేదు. దీన్నిబట్టి ఇతని అరెస్ట్ కి రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదని చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ విషయం గురించి మరింత సమాచారం కొరకు గూగుల్ లో వెతకగా ఉగ్రవాది అబ్దుల్లా ధానిష్ ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్న వార్తకి సంబంధించి చాలా వార్తా కథనాలు మాకు కనిపించాయి. అలాంటి ఒక వార్తా కథనం ప్రకారం అహ్మదాబాద్ పేలుళ్ళ సూత్రదారి నిషేదిత ఉగ్రవాద సంస్థ అయిన SIMI (Students Islamic Movement of India) కి చెందిన అబ్దుల్లా ధానిష్ ని ఢిల్లీ పోలీస్ కి చెందిన స్పెషల్ సెల్ 05 డిసెంబర్ 2020న అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఒక సంవత్సరం ముందు నుండి ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీలో అబ్దుల్లా ధానిష్ కదలికలని ట్రాక్ చేసి పట్టుకున్నట్టు స్పెషల్ సెల్ కి చెందిన అత్తర్ సింగ్ మీడియాకి తెలిపినట్టు ఈ కథనంలో చూడొచ్చు. ఐతే ఈ కథనంలో ఎక్కడా కూడా అబ్దుల్లా ధానిష్ ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనల్లో పాల్గొంట్టు దొరికినట్టు లేదు. ఇదే విషయం తెలుపుతున్న మరొక వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు.
ఈ వార్తా కథనం ఆధారంగా ఢిల్లీ పోలీస్ అధికారిక వెబ్సైటులో వెతకగా ధానిష్ అరెస్ట్ కి సంబంధించి పోలీస్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ మాకు కనిపించింది. ఈ ప్రెస్ రిలీజ్ కూడా ఎక్కడా ధానిష్ రైతుల నిరసనల్లో పాల్గొంటు పట్టుబడ్డాడని చెప్పలేదు.
దీనికి సంబంధించిన న్యూస్ వీడియో లో కూడా ఎక్కడా ధానిష్ ని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోనల్లో పాల్గొన్నప్పుడు పట్టుబడ్డాడని చెప్పలేదు, ఈ అరెస్ట్ కి సంబంధించిన మరొక న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి SIMI ఉగ్రవాది ధానిష్ కి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
చివరగా, SIMI ఉగ్రవాది అబ్దుల్లా ధానిష్ అరెస్ట్ కి రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు.