Fake News, Telugu
 

వాటర్ బాటిల్స్‌ క్యాప్ కలర్‌ బట్టి నీటి నాణ్యత ఉంటుందని ఈ వీడియోలో చెప్తున్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు

0

సాధారణంగా మనం బయట కొనుక్కుని తాగే వాటర్ బాటిల్ క్యాప్ రంగుని బట్టి నీటి నాణ్యత ఉంటుందని చెప్తున్న వీడియో ఒకటి విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఉదాహరణకి, తెల్లని క్యాప్ ఉన్న బాటిల్ నీరు ఎక్కువగా శుద్ధి చేసినవని, బ్లూ కలర్ క్యాప్స్ ఉన్న బాటిల్స్‌లో ఉండే నీరు, నదులు మొదలైన వాటి నుండి సేకరించిన ‘స్ప్రింగ్ వాటర్’ అని, అలాగే బ్లాక్ కలర్ క్యాప్ ఉంటే ఆల్కలీన్ వాటర్ అంటూ ఈ వీడియోలో చెప్తున్నారు (ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఈ సమాచారంలో నిజమెంతుందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వాటర్ బాటిల్స్‌ క్యాప్ కలర్‌ బట్టి నీటి నాణ్యత ఉంటుంది.

ఫాక్ట్(నిజం): ఒక్కో క్వాలిటీ నీళ్ల బాటిల్‌కు ఒక్కో కలర్ క్యాప్ ఉండాలని ఎలాంటి నిబంధన లేదు. బాటిల్ క్యాప్ కలర్ అనేది ఆ కంపెనీ తీసుకునే నిర్ణయం తప్ప క్యాప్ కలర్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్స్ కూడా వీడియోలో చెప్తున్నట్టు ఎలాంటి కలర్ కోడ్ పాటించట్లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మార్కెట్‌లో అందుబాటులో వాటర్ బాటిల్స్ క్యాప్స్ వివిధ రంగుల్లో ఉంటాయి. ఐతే ప్రస్తుతం షేర్ చేస్తున్న వీడియోలో చెప్తున్నట్టు వాటర్ బాటిల్ క్యాప్ రంగుకి, నీళ్ల నాణ్యతకి ఎలాంటి సంబంధం లేదు. సాధారణంగా మన దేశంలో ఆహార పదార్థాల భద్రతకు సంబంధించి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.  ఆహార భద్రత మరియు ప్యాకేజింగ్ మొదలైన అంశాలలో పాటించాల్సిన నిబంధనలు/నియమాలు FSSAI రూపొందిస్తుంది.

ఐతే ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో పాటించాల్సిన నియమాలకు సంబంధించి FSSAI రూపొందించిన మార్గదర్శకాలలో వాటర్ బాటిల్ క్యాప్ కలర్‌కు సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఒక్కో క్వాలిటీ వాటర్ బాటిల్‌కు ఒక్కో రంగు క్యాప్ ఉండాలని FSSAI ఎలాంటి మార్గదర్శకాలు నిర్దేశించలేదు. FSSAI చేసిన గైడ్లైన్స్/చట్టాల ద్వారా ఇది స్పష్టమవుతుంది.

ఇటీవల FSSAI రంగు బాటిల్స్‌లో నీళ్లను ప్యాకేజీ చేసేందుకు అనుమతి ఇచ్చింది, కానీ బాటిల్ క్యాప్ రంగుకు సంబంధించి ఎలాంటి నియమాలను చేయలేదు. దీన్నిబట్టి బాటిల్ క్యాప్స్ కలర్‌కు, నీటి నాణ్యతకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. అన్ని వాటర్ బాటిల్స్‌లోని నీరు మాత్రం ఒకటే, కాకపోతే వారు కలిపే రసాయనాల బట్టి రుచి మారుతుంది. ఈ వాటర్ బాటిల్‌పై నీళ్లలో ఏం కలిపారో అన్న సమాచారాన్ని క్లుప్తంగా ఇస్తారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో చెప్తున్నదానికి వ్యతిరేకంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్స్ కాప్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఆల్కలీన్ వాటర్ విక్రయించే ఈ బ్రాండ్ బాటిల్ క్యాప్ వైరల్ వీడియోలో చెప్తున్నట్టు బ్లాక్ కలర్‌లో కాకుండా గ్రీన్ కలర్‌లో ఉంది. అలాగే పాపులర్ అయిన ‘కిన్లే’ వాటర్ బాటిల్ క్యాప్ బ్లూ కలర్‌లో ఉంటుంది, కానీ బాటిల్‌లో విక్రయించేది మాత్రం ‘స్ప్రింగ్ వాటర్’ కాదు.  దీన్నిబట్టి వీడియోలో చెప్తున్నట్టు బాటిల్ క్యాప్ కలర్‌కు, అందులోని నీళ్లకు ఎలాంటి సంబంధం లేదని మరొకసారి స్పష్టమవుతుంది.  బాటిల్ క్యాప్ కలర్ అనేది ఆ కంపెనీ తీసుకునే నిర్ణయం తప్ప క్యాప్ కలర్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఐతే కొన్ని ప్రముఖ వార్తా సంస్థలు వైరల్ వీడియోలో వీడియో చెప్తున్న విషయాన్ని ప్రచురించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ).

చివరగా, వాటర్ బాటిల్స్‌ క్యాప్ కలర్‌ బట్టి నీటి క్వాలిటీ ఉంటుందని ఈ వీడియోలో చెప్తున్నది నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll