Fake News, Telugu
 

మణిపూర్ నుంచి తన భారత్ జోడో యాత్ర 2.0ని ప్రారంభించినందుకు రాహుల్ గాంధీకి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

0

రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇటీవల మణిపూర్ నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా, ఒక చైనా మీడియా సంస్థ చేసిన ట్వీట్ అని చెప్తూ ఒక స్స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాహుల్ గాంధీ తన యాత్రను అరుణాచల్ ప్రదేశ్ నుంచి కాకుండా మణిపూర్ నుంచి ప్రారంభించినందుకు చైనా ప్రధాని షీ జిన్‌పింగ్ ధన్యవాదాలు తెలిపారు అని చెప్తూ ఈ స్క్రీన్‌షాట్‌ వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఇందులోని నిజానిజాలు తెలుసుకుందాం.

క్లెయిమ్: ‘భారత ఆక్రమిత’ అరుణాచల్ ప్రదేశ్ నుంచి తన భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించడానికి బదులుగా, మణిపూర్ నుండి చేసినందుకు రాహుల్ గాంధీకి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు అని చెప్పి గ్లోబల్ టైమ్స్ న్యూస్ వార్త సంస్థ చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్.

ఫాక్ట్(నిజం): గ్లోబల్ టైమ్స్ న్యూస్, వారి ‘X’ హ్యాండిల్‌లో ఈ విధమైన వార్త ఏదీ పోస్ట్ చేయలేదు. అలాగే, మణిపూర్ నుండి ప్రారంభించినందుకు రాహుల్ గాంధీకి షీ జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపాడు అని చెప్పడానికి ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

మొదటగా, వైరల్ క్లెయిమ్ యొక్క వాస్తవికతను తనిఖీ చేయడానికి, మేము వారి అధికారిక ‘X’ హ్యాండిల్‌లో గ్లోబల్ టైమ్స్ న్యూస్ పోస్ట్ చేసిన ట్వీట్‌లను జాగ్రత్తగా పరిశీలించాము. కానీ, వారు ఈ పోస్ట్‌ను 14 జనవరి 2024న చేశారని చెబుతున్న వైరల్ స్క్రీన్‌షాట్‌కు విరుద్ధంగా, ఆ రోజు వారి అకౌంటులో మాకు ఇలాంటి ట్వీట్ ఏదీ కనిపించలేదు.

ఈ వార్తను చైనా మీడియా సంస్థ అయిన గ్లోబల్ టైమ్స్ న్యూస్ ప్రచురించింది అనడానికి రుజువుగా, ‘X ‘ మరియు Googleలో అడ్వాన్స్డ్ సెర్చ్ చేసినా కూడా ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం మాకు దొరకలేదు. 

తర్వాత, మేము వైరల్ స్క్రీన్‌షాట్‌ యొక్క సందర్భాన్ని తెలుసుకోవడానికి ఆ స్క్రీన్‌షాట్‌లో ఉన్న వీడియో పోర్షన్‌ వరకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా మాకు మార్చి 2018 నాటి వీడియో ఒకటి దొరికింది. ఇందులో ఆ స్క్రీన్‌షాట్‌కు సరిపోయే విజువల్స్‌ ఉన్నాయి. ఈ వీడియో 7 మార్చి 2018న, చైనాలో జరిగిన 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ యొక్క మొదటి సెషన్‌లో తీసింది (ఇక్కడ మరియు ఇక్కడ). ఆ రోజు, 2024లో ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి అతను మాట్లాడి ఉండే అవకాశం లేదు.

ఇంకా, రాహుల్ గాంధీ గురించి చైనా అధ్యక్షుడు అలాంటి ప్రకటన చేస్తే, ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు దానిపై కచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేవి. కానీ ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేసి చూస్తే వైరల్ క్లైయి్‌మ్‌కి మద్దతు ఇవ్వడానికి విశ్వసనీయమైన వార్తా కథనాలు ఏవీ దొరకలేదు . రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి జిన్‌పింగ్ గతంలో కానీ, ఇటీవల కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి, వైరల్ స్క్రీన్‌షాట్ కేవలం ఒక ఎడిట్ చేసిన గ్రాఫిక్ అని మనం నిర్ధారించుకోవచ్చు.

చివరిగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రాహుల్ గాంధీ, తన భారత్ జోడో యాత్ర 2.0ని మణిపూర్ నుండి ప్రారంభించినందుకు తనకి కృతజ్ఞతలు చెప్పలేదు, వైరల్ స్క్రీన్‌షాట్ డిజిటల్ గా తయారు చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll