“ఇంగ్లాండ్‌లోని ఒక నది నుండి మత్స్యకారుల ద్వారా భారతీయ భాషలో జన గణనగణిత గుర్తులు చెక్కబడిన 60 క్యూబిక్ నవగ్రహ యంత్రాలు కనుగొనబడ్డాయి. ఇవి 6000 సంవత్సరాల నాటివని తేలింది” అని చెప్తూ కొన్ని క్యూబ్‌లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 6000 సంవత్సరాల నాటి భారతీయ నవగ్రహ యంత్రాలు ఇంగ్లండ్‌లోని ఒక నదిలో కనుగొనబడ్డాయి.
ఫాక్ట్: ఇంగ్లండ్‌లోని నదిలో ఈ లోహపు క్యూబ్‌లు దొరికిన వార్త నిజమే కానీ ఇవి 6000 ఏళ్ల నాటివి అని ఎవరూ నిర్ధారించలేదు. ‘The Hindu’ కథనం ప్రకారం ఈ క్యూబ్ల పైన ఉన్న అంకెలు ‘రాహు యంత్రం’లో ఉండే అంకెలను సూచిస్తున్నాయి. పైగా వీటి పైన ఉన్నది దేవనాగరి లిపి. ఈ లిపి కేవలం క్రీ.శ. 11 వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. మరియు నాణెం పైన ‘KP’ అని ఇంగ్లీషులో ముద్రించి ఉంది. కావున, ఈ లోహపు సామగ్రి 6000 ఏళ్ల నాటిది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అందువలన, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ వార్తని గురించి ఇంటర్నెట్లో వెతకగా, ‘Dailystar’, ‘Coventrytelegraph’ మే 2020లో ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి. ఈ కథనాల ప్రకారం, ఇంగ్లండ్‌కు చెందిన ‘విల్ రీడ్’ అనే వ్యక్తి 2020 మే నెలలో magnet fishing (అయస్కాంతం సహాయంతో నీటిలో ఉండే వస్తువులను కనిపెట్టే వ్యాపకం) చేస్తుండగా, లోహంతో చేసిన దాదాపు 60 క్యూబ్‌లు మరియు నాణేలు దొరికాయి. ఇక వాటి వివరాలను తెల్సుకోవడానికి, ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, ఇవి 6000 సంవత్సరాల నాటివి అని ఎవరూ నిర్ధారించలేదు.
ఈ వార్త గురించి ‘The Hindu’ లో వచ్చిన కథనం ప్రకారం, ఈ క్యూబ్ ల పైన ఉన్న అంకెలు దేవనాగరి లిపి లో ఉన్నాయి. ఈ క్యూబ్ల పైన ఉండే అంకెలు ‘రాహు యంత్రం’లో ఉండే అంకెలను సూచిస్తున్నాయి.
అయితే ‘Britannica’ వెబ్సైటు ప్రకారం, దేవనాగరి లిపి క్రీస్తు శకం 11వ దశాబ్దం నుంచి వాడుకలో ఉంది. మరియు ఫోటోలోని ఒక నాణెం పైన ‘KP’ అని ఇంగ్షీషులో రాసి ఉంది. పై సమాచారాన్ని బట్టి చూస్తే ఈ లోహపు సామగ్రి 6000 సంవత్సరాల నాటిది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
చివరిగా, ఇంగ్లండ్ నదిలో దొరికిన లోహపు క్యూబ్‌లు 6000 సంవత్సరాల నాటివి అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.