‘కోవిడ్ వ్యాక్సిన్లను నిరాకరించినందుకు గాను ఇప్పటికే హైతీ, టాంజానియా, బురుండి, ఐవరీ కోస్ట్, స్వాజిలాండ్ (ఇప్పుడు యస్వతిని) దేశాల అధినేతలు హత్యలకు గురైనారు’ అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. పోస్టులో మాడగాస్కర్ అధ్యక్షుడిపై కూడా వాక్సిన్లు అవసరం లేదు అని చెప్పటంతో దాడి జరిగిందని అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కోవిడ్ వ్యాక్సిన్లను నిరాకరించినందుకు గాను ఇప్పటికే హైతీ, టాంజానియా, బురుండి, ఐవరీ కోస్ట్, యస్వతిని (ఒకప్పుడు స్వాజిలాండ్) దేశాల అధినేతలు హత్యలకు గురైనారు, మాడగాస్కర్ అధ్యక్షుడిపై హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఫాక్ట్: వాక్సినేషన్ తిరస్కరించడం వలనే హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోసియోస్ చంపబడ్డాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి గుండె సమస్యతో మరణించారు, తను హత్య చేయబడ్డట్టు కచ్చితమైన సమాచారం లభించలేదు. బురుండి అధ్యక్షుడు పియరీ కురుంజిజా 8 జూన్ 2020న కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారు, అప్పటికింకా వాక్సినేషన్ మొదలుకాలేదు. ఐవరీ కోస్ట్ ప్రధాని హమేద్ బకాయోకో కాన్సర్‌తో చనిపోయారు, ఎవరో హత్య చేయడం వల్ల కాదు. యస్వతిని ప్రధాని ఆంబ్రోస్ డ్లామిని 13 డిసెంబర్ 2020న కోవిడ్ వలన చనిపోయారు. మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెలినా 22 జులై 2021న హత్యాప్రయత్నం నుండి బయటపడ్డారు, అప్పటికే వాక్సిన్ పై తన వైఖరి మారింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
హైతీ:
హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోసియోస్ జూలై 7న రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్ లోని తన ప్రైవేట్ నివాసంలో హత్యకు గురయ్యారు. దర్యాప్తులో భాగంగా అధ్యక్ష భద్రతా చీఫ్ జీన్ లగుయెల్ సివిల్ ను అరెస్టు చేసినట్లు హైతియన్ పోలీసులు తెలిపారు.
మొదట్లో హైతీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనెకా షాట్ ను స్వీకరించడానికి సంకోచాన్ని వ్యక్తం చేసింది. కానీ, వ్యాక్సిన్ ను పూర్తిగా తిరస్కరించలేదు.
జూలై 14న హైతీకి తన మొదటి 500,000 కోవిడ్-19 డోసులను కోవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ పథకం ద్వారా అమెరికా ప్రభుత్వం విరాళంగా అందించింది. జూలై 16న హైతీ తన వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పీఏహెచ్ ఓ) తెలిపింది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వాక్సినేషన్ తిరస్కరించడం వలనే హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోసియోస్ చంపబడ్డాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు.
టాంజానియా:
టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి 61 ఏళ్ల వయసులో మరణించారు. దార్ ఎస్ సలాం లోని ఆసుపత్రిలో గుండె సమస్యలతో ఆయన మరణించారని సామియా సులూహు హసన్ రాష్ట్ర టెలివిజన్ లో ఒక ప్రసంగంలో తెలిపారు. మిస్టర్ మగుఫులి ఆఫ్రికాలో ప్రముఖ కరోనావైరస్ సందేహాస్పదులలో ఒకరు.
వాక్సిన్ వచ్చిన మొదట్లో దానిని టాంజానియా నిరాకరించింది. కానీ, జూలై 28న, టాంజానియా అధ్యక్షుడు సామియా సులూహు హసన్ తన కోవిడ్-19 వ్యాక్సిన్ ను పొందారు, ఇది దేశం యొక్క వ్యాక్సినేషన్ యొక్క అధికారిక ప్రారంభాన్ని సూచిస్తుందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
బురుండి:
8 జూన్ 2020న కార్డియాక్ అరెస్ట్ తరువాత కరుసిలోని సిన్క్వాంటెనైర్ ఆసుపత్రిలో బురుండి అధ్యక్షుడు పియరీ కురుంజిజా మరణించారు. ఆయన మరణించిన సమయంలో అప్పటికి ఇంకా కోవిడ్-19 వాక్సిన్ అందుబాటులో లేదు. కావున, వాక్సిన్ నిరాకరించటం మూలాన వారు హత్యకు గురైయ్యారు అనేదాంట్లో అర్థం లేదు.
బురుండి ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్లను అంగీకరించినట్లు తెలుస్తుంది. వాటిని స్వీకరించిన ప్రపంచంలోని చివరి దేశాలలో ఒకటిగా మారిందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.. కానీ వాక్సిన్ కలిగించే ఏ దుష్ప్రభావాలకు బాధ్యత వహించబోమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐవరీ కోస్ట్:
10 మార్చ్ 2021న ఐవరీ కోస్ట్ ప్రధాని హమేద్ బకాయోకో జర్మన్ నగరమైన ఫ్రీబర్గ్ లో క్యాన్సర్ తో మరణించారు, అక్కడ ఆయన వైద్య చికిత్స పొందుతూ చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రజలను కోవిడ్-19కు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు, అది ఒక నిజమైన వ్యాధి అని కూడా ఆయన అన్నారు. అయితే, బకాయోకో వాక్సిన్ లను నిరాకరించినట్టు ఎటువంటి ఆధారాలు, వార్తలు మాకు లభించలేదు.
ప్రపంచ వ్యాక్సిన్-భాగస్వామ్య కార్యక్రమం అయిన కోవాక్స్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ ల షిప్ మెంట్ అందుకున్న రెండవ దేశంగా ఐవరీ కోస్ట్ నిలిచింది. ఫిబ్రవరి 2021 లోనే వారు ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వాక్సిన్ లను అందుకున్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
యస్వతిని (ఒకప్పుడు స్వాజిలాండ్):
కోవిడ్-19 పాజిటివ్ గా ఉన్న యస్వతిని ప్రధాని ఆంబ్రోస్ డ్లామిని 13 డిసెంబర్ 2020న దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిలో చేరిన తర్వాత 52 ఏళ్ల వయసులో మరణించారు. ఆంబ్రోస్ డ్లామిని వాక్సిన్ ను నిరాకరించినట్టు ఎటువంటి ఆధారాలు, వార్తలు మాకు లభించలేదు.
యస్వతిని తమ వాక్సినేషన్ కాంపెయిన్ ను మార్చి 2021లోనే మొదలుపెట్టినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
మాడగాస్కర్:
మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెలినా 22 జులై 2021న హత్యాప్రయత్నం నుండి బయటపడ్డారని ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. రాజోలీనాపై హత్యాప్రయత్నాన్ని అధికారులు విఫలం చేశారని. దర్యాప్తులో భాగంగా ఇద్దరు ఫ్రెంచ్ జాతీయులను పట్టుకున్నట్లు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెలినా మర్చి 2021న కరోనావైరస్ వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా తన కఠినమైన వైఖరిని వెనక్కి తీసుకున్నారు. మే నెలలోనే ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనెకా డోసులు కోవాక్స్ ప్రోగ్రాం ద్వారా మాడగాస్కర్ కు చేరుకున్నాయి. కావున, వాక్సిన్ నిరాకరించటం వలన ఆండ్రీ రాజోయెలినాపై హత్యా ప్రయత్నం చేసారు అనటంలో అర్ధం లేదు. ఎందుకంటే, అప్పటికే వాక్సిన్ పై తన వైఖరిని మార్చుకున్నారు గనుక.
చివరగా, కోవిడ్ వాక్సిన్లను నిరాకరించినందుకు ఈ దేశాల అధినేతలు హత్యలకు గురైనట్టు ఎటువంటి ఆధారాలు లేవు.