అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారని చెప్తూ ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఫాక్ట్(నిజం): ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనం ప్రకారం 2007-14 మధ్య అమెరికాలో క్రైస్తవుల జనాభాలో తగ్గుదల, హిందూ జనభాలో పెరుగుదల కనిపించింది. ఐతే క్రైస్తవులు తమ మతాన్ని విడిచి హిందూ మతంలోకి మారుతున్నారని మాత్రం అధ్యయనంలో ప్రస్తావించలేదు. అమెరికాలోని హిందువులలో ఎక్కువ శాతం వలస వచ్చినవారే. కాగా ఏ మతానికీ అనుబంధం లేని వారి సంఖ్య పెరగడం క్రైస్తవుల జనాభా తగ్గడానికి ఒక కారణమని తెలిపింది. ఇదిలా ఉంటే అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవాన్ని విడిచి హిందూ మతంలోకి మారినట్టు ఎక్కడా ఆధారాలు కానీ, రిపోర్ట్స్ కానీ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
అమెరికాలో హిందూ జనాభా పెరుగుతుంది:
ప్యూ రీసెర్చ్ సెంటర్ 2015లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2007-14 మధ్య అమెరికాలో క్రైస్తవుల జనాభా 10% తగ్గింది. 2007లో 78.4 శాతంగా ఉన్న క్రైస్తవుల సంఖ్య 2014లో 70.6 శాతానికి పడిపోయింది. కాగా ఇదే సమయంలో అమెరికాలోని హిందూ మరియు ముస్లింల జనాభా రెట్టింపు అయ్యిందని ఈ నివేదిక పేర్కొంది. 2007-14 మధ్యలో హిందువుల జనాభా శాతం 0.4 నుండి 0.7 శాతానికి పెరిగిందని, అదే విధంగా ముస్లింల సంఖ్య 0.4 నుండి 0.9 శాతం పెరిగిందని ప్యూ అధ్యయనం వెల్లడించింది. దీనితో అమెరికాలో హిందూ మతం నాల్గవ పెద్ద మతంగా అవతరించింది (ఇక్కడ).
ఐతే ఈ అధ్యయనం ప్రకారం అమెరికాలోని హిందువుల జనాభాలో వలస వచ్చినవారి సంఖ్యే ఎక్కువుంది. అత్యధికంగా 91% మంది ఆసియా మూలాలకి చెందినవారు కాగా, కేవలం 4% లేదా అంతకంటే తక్కువ శాతం మంది తెలుపు, నలుపు, లాటినో లేదా మిక్స్ మూలాలకి చెందినవారు. ఇదిలా ఉంటే 2007-14 మధ్య కాలంలో తమను ఏ మతానికి అనుబంధం కాము అని చెప్పిన వారి సంఖ్య పెరిగింది. ఈ కాలంలో వీరి సంఖ్య 1.9 కోట్లు పెరిగి 5.6 కోట్లకు చేరుకుంది. తరాలు మారి కొత్త తరాలవారికి మత విశ్వాసాలపై నమ్మకం తగ్గిపోవడం క్రైస్తవుల సంఖ్య తగ్గడానికి ఒక కారణమని ఈ నివేదిక వెల్లడించింది.
రాబోయే రోజుల్లో అమెరికాలో హిందువుల జనాభా పెరుగుతుందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. 2010లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో అమెరికాలో ఉన్నవారి శాతం 0.6% కాగా, ఈ సంఖ్య 2050 కల్ల 1.2% వరకు చేసుకుంటుందని తెలిపింది.
ఐతే ఈ రిపోర్ట్‌లో అమెరికాలో క్రైస్తవాన్ని విడిచి హిందూ మతంలోకి మారుతున్నట్టు మాత్రం చెప్పలేదు. పైగా అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవాన్ని విడిచి హిందూ మతంలోకి మారినట్టు ఎక్కడా ఆధారాలు కానీ, రిపోర్ట్స్ కానీ లేవు. కాబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమవుతుంది.
గతంలో వీహెచ్‌పీ లీడర్ ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు:
2016లో ఒకసారి విశ్వ హిందూ పరిషద్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 7.5 లక్షల మంది ముస్లింలు మరియు క్రైస్తవులు హిందూ మతంలోకి మారారంటూ వ్యాఖ్యలు చేసాడు (ఇక్కడ మరియు ఇక్కడ). కాని ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు అయన అందించలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తకు ఇదే మూలం అయ్యుంటుంది. 2016లో ప్రవీణ్ తొగాడియా ఈ వ్యాఖ్యలు చేసినప్పటినుండి ఈ వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉంది.
ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో లండన్‌లో జరిగిన రథయాత్రకు సంబంధించింది:
ఇదిలా ఉండగా ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఎక్కడిదనేది కచ్చితంగా తెలియనప్పటికీ, ఈ వీడియో ఇస్కాన్ ఇటీవల జులై 2023లో లండన్ నగరంలో నిర్వహించిన రథయాత్రకు సంబంధించింది అంటూ పలు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే అధికారిక సమాచారం ప్రకారం ఇస్కాన్ జులై 2023లో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలలో రథయాత్రలు నిర్వహించింది. అమెరికాలో కూడా ఈ రథయాత్రలు నిర్వహించింది.
చివరగా, అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.