Fake News, Telugu
 

కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

“కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చుకొని హిందువులుగా మారిన క్రైస్తవులు” అంటూ, ఫోటో కొలాజ్‌ను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చుకొని హిందువులుగా మారిన క్రైస్తవులు.

ఫాక్ట్: కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోస్టులో పెట్టిన కొలాజ్‌లోని ఫోటోలు ఇస్కాన్ మరియు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంకు సంబంధించినవి. కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చుకొని హిందువులుగా మారిన క్రైస్తవులు అంటూ ఇటీవల ఎటువంటి వార్తలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.  

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కెనడాలో అలా జరిగినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగుంటే అక్కడి మీడియా దాని గురించి ప్రచురించేవి; దానికి సంబంధించి ఎలాంటి వార్తా కథనాలు మాకు లభించలేదు.

ఫోటో కొలాజ్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ కొలాజ్‌లోని ఫోటోలు ఇస్కాన్ మరియు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంకు సంబంధించిన వెబ్సైటుల్లో లభించాయి.

కొంత మంది అమ్మాయిలు నృత్యం చేస్తున్నట్టు ఉన్న ఒక ఫోటో ఇస్కాన్ వారి వెబ్సైటులోని బ్యానర్ ఇమేజ్ గా ఉన్నట్టు చూడొచ్చు. ఇస్కాన్ ఆస్టిన్ వారి వెబ్సైటులో ఇది ఒక ‘రష్యా హరినాం’ అని ఉంది; మరియు ఇంకో ఇస్కాన్ వెబ్సైటులో కూడా ఈ ఇమేజ్ 2015లో రాసిన ఆర్టికల్‌లో ఉంది.  

ఒక పిల్లాడితో దంపతులు దిగిన ఫోటో కనీసం 2013 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. పెళ్లి, దాని విలువలకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఇస్కాన్ వెబ్సైటులో ఇదే ఫోటోతో లభించింది. మరో రెండు ఫోటోలకు సంబంధించి సమాచారం మాకు లభించలేదు.  

టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన రిపోర్ట్ ప్రకారం, కెనడాలోని ఒక 125 సంవత్సరాల పురాతన ప్రాపర్టీని అహ్మెదాబాద్ కు చెందిన స్వామినారాయణ్ గుడి సంస్థాన్ వారు కొన్నట్టు తెలుస్తుంది. అమెరికా, యుకేలలో ఎనిమిది చర్చిలదాకా స్వామినారాయణ్ సంస్థాన్ వారు తీసుకుని హిందూ దేవాలయాలుగా మార్చారని తెలుస్తుంది. కానీ, కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చుకొని హిందువులుగా మారిన క్రైస్తవులు అంటూ ఇటీవల ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు.

చివరగా, కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll