Fake News, Telugu
 

ఉద్యోగాలలో సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం అంటూ షేర్ చేసిన ఈ వివరాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు

0

దేశ జనాభాలో తక్కువగా ఉన్న అగ్రకులాల వారు ఉద్యోగాల్లో మాత్రం ఎక్కువగా ఉన్నారని, అదే దేశ జనాభాలో ఎక్కువ శాతంగా ఉన్న SC, ST మరియు BCలు ఉద్యోగాల్లో తక్కువగా ఉన్నారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పోస్టులో తమ వాదనకు మద్దతుగా కొన్ని గణాంకాలు కూడా షేర్ చేసారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మొత్తం ఉద్యోగాలలో వర్గాల వారిగా ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలు.

ఫాక్ట్(నిజం):  ఈ గణాంకాలకు ఎటువంటి ఆధారాలు లేవు. సాధారణంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలలో కులాలకు/వర్గాలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించరు. కేవలం ఆయా కులానికి/వర్గానికి నిర్ణయించిన రిజర్వేషన్ ఆధారంగా నియామకాలు చేస్తాయి. పైగా ఈ గణాంకాల ప్రాతిపదిక ఏంటో, ఈ గణాంకాలు ఎక్కడి నుండి సేకరించారో కూడా పోస్టులో చెప్పలేదు. ఇటీవల ప్రభుత్వం గానీ లేక మరే ఇతర సంస్థ గాని ఈ వివరాలు వెల్లడించినట్టు సమాచారం లేదు. ఇప్పటివరకు సెన్సస్ లెక్కల్లో SC, STల మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదు. అలాగే పోస్టులో జనాభాలో వర్గాల వారిగా ఎవరు ఎంత శాతం ఉన్నారో అని చెప్తున్న వివరాలు కూడా కరెక్ట్ కాదు.  కాబట్టి పోస్టులో చెప్తున్న BC, OC మరియు EWS జనాభా లెక్కలకు సంబంధించి అధికారిక వివరాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

గణాంకాలకు ఎటువంటి ఆధారాలు లేవు :

ఉద్యోగాలలో వర్గాల వారీగా ప్రాతినిధ్యానికి సంబంధించిన పోస్టులో షేర్ చేసిన గణాంకాలకు ఎటువంటి ఆధారాలు లేవు. సాధారణంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలలో కులాలకు/వర్గాలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించరు. కేవలం ఆయా కులానికి/వర్గానికి నిర్ణయించిన రిజర్వేషన్ ఆధారంగా నియామకాలు చేస్తాయి.   

పైగా ఈ గణాంకాల ప్రాతిపదిక ఏంటో, ఈ గణాంకాలు ఎక్కడి నుండి సేకరించారో కూడా పోస్టులో చెప్పలేదు. ఇటీవల ప్రభుత్వం గానీ లేక మరే ఇతర సంస్థ గానీ ఈ వివరాలు వెల్లడించినట్టు సమాచారం లేదు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జనభా ఆధారంగా ఉద్యోగాలలో కులాల ప్రాతినిథ్యం ఎంత అన్న వివరాలు వెల్లడించవు కూడా.

అలాగే పోస్టులో జనాభాలో వర్గాల వారీగా ఎవరు ఎంత శాతం ఉన్నారో అని చెప్తున్న వివరాలు కూడా కరెక్ట్ కాదు. సాధారణంగా జనాభా వివరాలకు సంబంధించి సెన్సస్ డేటాను ప్రాతిపదికగా పరిగణిస్తుంటారు. ఐతే ఇప్పటివరకు సెన్సస్ లెక్కల్లో SC, STల మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదు.  కాబట్టి పోస్టులో చెప్తున్న BC, OC మరియు EWS జనాభా లెక్కలకు సంబంధించి అధికారిక వివరాలు లేవు. చివరి సరిగా 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం, మొత్తం జనాభాలో 16.6% మంది షెడ్యూల్డ్ కులాలు కాగా, 8.6% మంది షెడ్యూల్డ్ తెగలు.

పైగా EWS అనేది ఇటీవల 2019లో ప్రవేశపెట్టారు. EWS రిజర్వేషన్ ప్రవేశపెట్టిన తరవాత ఎటువంటి జనగణన జరగలేదు. ముఖ్యంగా EWS అనేది వార్షిక ఆదాయ ప్రాతిపదికన పరిగణిస్తారు, కాబట్టి EWS కింద అర్హులైన వారు తరచూ మారుతూ ఉంటారు. అలాగే EWS అనేది ఇటీవల ప్రవేశపెట్టారు కాబట్టి మొత్తం ఉద్యోగులలో వారి సంఖ్య 10% ఉంటుందన్న వాదన కరెక్ట్ అయ్యుండదు.

కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కులాల వారి ప్రాతినిథ్యం :

సాధారణంగా ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి సర్వే చేయదు. ఐతే 2019లో కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో SC, ST మరియు BCల ప్రాతినిధ్యానికి సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరడంతో, అప్పటి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌కు సమర్పించిన వివరాల ప్రకారం ‘01 జనవరి 2016 నాటికి కేంద్ర ప్రభుత్వంలోని 78 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు, వాటి అనుబంధ/సబార్డినేట్ కార్యాలయాలలోని పోస్టులు మరియు సర్వీసుల్లో SCలు, STలు మరియు OBCల ప్రాతినిధ్యం 17.49%, 8.47% మరియు 21.57% గా ఉన్నది.’

ఈ వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో SC మరియు STల ప్రాతినిధ్యం వారి నిర్దేశిత రిజర్వేషన్ శాతం కంటే ఎక్కువ (15% &7.5%) ఉంది. OBCల ప్రాతినిధ్యం (21.57%) వారికి సూచించిన రిజర్వేషన్ల శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది.

ఈ సమాచారంలో మైనారిటీ, OC మొదలైన వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఐతే కేవలం ఈ సమాచారం ఆధారంగా దేశంలోని పరిస్తితులపై ఒక అంచనాకు రాలేము. ఎందుకంటే ఇవి కేవలం కేంద్ర సర్వీసులకు సంబంధించిన వివరాలు మాత్రమే. ఇక ఆయా రాష్ట్రాలలోని ఉద్యోగులలో కులాల వారీగా ప్రాతినిధ్యానికి సంబంధించి వివరాలు తెలియవు.

చివరగా, ఉద్యోగాలలో కులాల వారీ ప్రాతినిధ్యం అంటూ షేర్ చేసిన ఈ వివరాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll