Fact Check, Fake News, Telugu
 

‘దేశంలోనే ‘లవ్ జిహాద్’ లో తెలంగాణ టాప్’ అంటూ ఇచ్చిన ఈ అంకెలకి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు.

0

దేశంలోనే ‘లవ్ జిహాద్’ లో తెలంగాణ టాప్. హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు 10, మరియు తెలంగాణ రాష్ట్రంలో 60 లవ్ జిహాద్ మిస్సింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన ఏడాదిలో 3418 అమ్మాయిల మిస్సింగ్ కేసులు,’ అని ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశంలోనే ‘లవ్ జిహాద్’ లో తెలంగాణ టాప్. హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు 10, మరియు తెలంగాణ రాష్ట్రంలో 60 లవ్ జిహాద్ మిస్సింగ్ కేసులు నమోదు.

ఫాక్ట్: ‘లవ్ జిహాద్’ కి సంబంధించి మిస్సింగ్ కేసుల డేటా ని కేంద్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. NCRB రిపోర్ట్ లో ఇచ్చిన డేటా ప్రకారం 2019 లో తెలంగాణ లో 10665 మహిళలు (అంటే సగటున రోజుకు సుమారు 29 మహిళలు) మిస్సింగ్ అయినట్టు ఉంది. కానీ, పోస్ట్ లో కేవలం ‘లవ్ జీహాద్’ మిస్సింగ్ కేసులు మాత్రమే రోజుకు 60 నమోదు అవుతున్నట్టు ఉంది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ‘లవ్ జిహాద్’ అనే పదం నిర్వచించబడలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 2020 లో లోక్ సభలో తెలిపారు. కావున, పోస్ట్ లో ఆధారాలు లేని అంకెలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ‘లవ్ జిహాద్’ కి సంబంధించి మిస్సింగ్ కేసుల డేటా ని కేంద్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ప్రకటించలేదని తెలుస్తుంది. వివిధ రాష్ట్రాల కి సంబంధించిన మిస్సింగ్ (కనపడకుండా పోవడం) వ్యక్తుల డేటాని NCRB (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వారు రిలీజ్ చేసే ‘క్రైమ్ ఇన్ ఇండియా’ రిపోర్ట్ లలో చూడవొచ్చు. 2020 లో మిస్సింగ్ కేసుల కి సంబంధించి NCRB ఇంకా ఇంకా రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. 2019 సంవత్సరానికి సంబంధించి రిలీజ్ చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా-2019’ రిపోర్ట్ లో తెలంగాణ కి సంబంధించిన మిస్సింగ్ వ్యక్తుల డేటాని చూడవొచ్చు.

NCRB రిపోర్ట్ లో ఇచ్చిన డేటా ప్రకారం 2019లో తెలంగాణ లో 10665 మహిళలు (అంటే సగటున రోజుకు సుమారు 29 మహిళలు) మిస్సింగ్ అయినట్టు ఉంది. కానీ, పోస్ట్ లో కేవలం ‘లవ్ జీహాద్’ మిస్సింగ్ కేసులు మాత్రమే రోజుకు 60 నమోదు అవుతున్నట్టు ఉంది. చాలా కారణాల వల్ల వ్యక్తులు తప్పి పోతుంటారు. వాటిలో కొన్ని కారణాలను ‘క్రైమ్ ఇన్ తెలంగాణ – 2019’ రిపోర్ట్ లో చూడవొచ్చు. కావున, కేవలం ‘లవ్ జీహాద్’ మిస్సింగ్ కేసులు మాత్రమే తెలంగాణ లో రోజుకు 60  నమోదు అవుతున్నట్టు చెప్పడానికి ఎటువంటి అధికారిక డేటా లేదు. 

అంతేకాదు, మిస్సింగ్ వ్యక్తుల్లో సుమారు 85.2 శాతం మంది ఆచూకీ తెలిసినట్టు NCRB రిపోర్ట్ లో చూడవొచ్చు. ఇదే విషయం చెప్తూ తెలంగాణ డీజీపీ కూడా 2019 లో ట్వీట్ చేసారు.

2019 చివరి నాటికి 3418 మిస్సింగ్ వ్యక్తుల (1673 పురుషులు, 1745 మహిళలు) ఆచూకీ తెలియాల్సి ఉన్నట్టు NCRB రిపోర్ట్ లో చూడవొచ్చు. అయితే, ఇదే సంఖ్య (3418) పోస్ట్ లో ‘గడిచిన ఏడాదిలో 3418 అమ్మాయిల మిస్సింగ్ కేసులు’  అని ఉన్నట్టు గమనించవొచ్చు.

2020 ఫిబ్రవరి లో లోక్ సభలో ఒక ప్రశ్నకు బదులిస్తూ, ‘ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ‘లవ్ జిహాద్’ అనే పదం నిర్వచించబడలేదు’, అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి తెలిపారు.

చివరగా, ‘దేశంలోనే ‘లవ్ జిహాద్’ లో తెలంగాణ టాప్’ అంటూ పోస్ట్ లో ఇచ్చిన అంకెలకి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll