Fact Check, Fake News, Telugu
 

భారత్‌లో ఆవు మాంసం ఎగుమతులపై నిషేధం ఉంది. భారత్ బీఫ్ పేరుతో కేవలం గేదె మాంసాన్ని ఎగుమతి చేస్తుంది.

0

‘ఆవును పూజించే భారతదేశం బీఫ్ ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. భారత్ నుండి బీఫ్ (గోమాంసం) ఎగుమతులు అధికంగా జరుగుతున్నాయని చెప్పడం క్లెయిమ్ ఒక్క ఉద్దేశం. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశం బీఫ్ (గోమాంసం) ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.

ఫాక్ట్(నిజం):  భారత దేశ ఎక్స్పోర్ట్ (ఎగుమతి) పాలసీ ప్రకారం బీఫ్ (ఆవు,దూడ,ఎద్దు) మాంసాల ఎగుమతులపై నిషేధం ఉంది. కాబట్టి దేశం నుండి ఆవు మాంసం ఎగుమతి కాదు. బీఫ్ పేరుతో కేవలం గేదె మాంసం మాత్రమే ఎగుమతి అవుతుంది. ఐతే గేదె మాంసం ఎగుమతుల్లో భారత్ టాప్-10 దేశాల్లో ఒకటిగా ఉంటూ వస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా టాప్-10 దేశాల్లో ఒకటిగా నిలిచింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

బీఫ్ ఎగుమతులకు సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భారత దేశంలో అమలులో ఉన్న ఎక్ష్పొర్ట్ పాలసీ ప్రకారం బీఫ్ (ఆవు,దూడ,ఎద్దు) మాంసాల ఎగుమతులపై నిషేధం ఉంది (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే బీఫ్ పేరుతో జరిగేది గేదె మాంసం ఎగుమతులు మాత్రమే, ఆవు మాంసం కాదు.

గేదె మాంసం ఎగుమతులు:

ఐతే అత్యధికంగా గేదె మాంసం ఎగుమతి చేసే దేశాలలో భారత్ ఒకటి. Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) ప్రకారం 2018-19 సంవత్సరంలో గేదె మాంసం ఉత్పత్తిలో భారతదేశం 1వ స్థానంలో ఉంది.

ఎగుమతులకు సంబంధించిన లేటెస్ట్ APEDA డేటా ప్రకారం 2020లో గేదె మాంసం ఎగుమతి చేసే దేశాలలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఆ సంవత్సరం భారత్ నుండి మొత్తం ఆరు లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల గేదె మాంసం ఎగుమతి చేసారు. గేదె మాంసం ఎగుమతుల్లో ఈ మధ్య కాలంలో భారత్ టాప్-10 దేశాల్లో ఒకటిగా ఉంటూ వస్తుంది.

ఐతే అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా భారత్ పలు సార్లు టాప్-10 దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఉదాహారణకు 2012 మరియు 2013 సంవత్సరాలలో గేదె మాంసం ఎగుమతుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

డాలర్ విలువలో పోల్చుకుంటే 2020 మరియు 2021లో భారత్ గేదె మాంసం ఎగుమతుల్లో నాలుగు మరియు ఆరో స్థానంలో నిలిచింది. దీనికి  సంబంధించిన కథనాలు ఇక్కడ చూడొచ్చు.

మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక గేదె మాంసం ఎగుమతులు పెరిగిన మాట నిజమే అయనప్పటికీ, పోస్టులో చెప్తున్నట్టు అది ఆవు మాంసం కాదు.

చివరగా, భారత్‌లో ఆవు మాంసం ఎగుమతులపై నిషేధం ఉంది. భారత్ బీఫ్ పేరుతో కేవలం గేదె మాంసాన్ని ఎగుమతి చేస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll