Fake News, Telugu
 

రాహుల్ గాంధీని ఉద్దేశించి రతన్ టాటా ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

0

‘2024లో మన దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారే’ అంటూ రతన్ టాటా రాహుల్ గాంధీని పొగిడాడు అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘రాహుల్ గాంధీ లాంటి ఒక మంచి స్వభావము, మంచి వ్యవహార శైలి లాంటి వ్యక్తినీ నేను ఇప్పటివరకు చూడలేదు’ అని కూడా టాటా అన్నట్టు ఈ పోస్టులో  చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఈ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 2024లో మన దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారే – రతన్ టాటా

ఫాక్ట్(నిజం): రతన్ టాటా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కాగా పోస్టులో షేర్ చేసిన ఫోటో 2012లో రాహుల్ గాంధీ కాశ్మీర్ యూనివర్సిటీ విద్యార్థులతో దేశంలో పలు పారిశ్రామికవేత్తల భేటీని ఏర్పాటు చేసిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

2024లో దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీయే అని రతన్ టాటా అన్నట్టు ఎటువంటి రిపోర్ట్స్ ఐతే లేవు. అలాగే రాహుల్ గాంధీ వ్యవహార శైలి మరియు స్వభావాన్ని రతన్ టాటా పొగుడుతూ పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేవు.

ఒకవేళ రతన్ టాటా నిజంగానే ఇలా వ్యాఖ్యానించి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి వార్తా కథనాలెవీ కనిపించలేదు.

ఈ ఫోటో 2012ది:

ఐతే రాహుల్ గాంధీ మరియు రతన్ టాటా ఒకే స్టేజీపై కూర్చొని ఉన్న ఈ ఫోటో 2012లో జమ్ముకాశ్మీర్‌లో విద్యార్థులతో భేటీ అయినప్పటిది. ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను 2012లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాల ప్రకారం అంతకుముందు కాశ్మీర్ యూనివర్సిటీ విద్యార్థులకు చేసిన వాగ్ధానం మేరకు రాహుల్ గాంధీ రతన్ టాటా, కుమారమంగళం బిర్లా మొదలైన పారిశ్రామికవేత్తలు మరియు యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఒక భేటీని ఏర్పాటు చేసారు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈ సందర్భంలో తీసిందే. ఈ భేటీను రిపోర్ట్ చేసిన మరొక కథనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ భేటీని ఏర్పాటు చేసినందుకు అప్పట్లో రతన్ టాటా రాహుల్ గాంధీని ప్రసంచించాడు. కాని ఈ సందర్భంగా పోస్టులో క్లెయిమ్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చేయలేదు.

ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ/కాంగ్రెస్ పలు సందర్భాలలో రతన్ టాటా/టాటా సంస్థపై విమర్శలు చేసారు. 2017 గుజరాత్ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ప్రభుత్వం నానో ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి టాటా సంస్థకు అందించిన ఆర్ధిక వెసులుబాటుకు సంబంధించి విమర్శలు చేసాడు. ఐతే రాహుల్ గాంధీ విమర్శలకు టాటా సంస్థకు కూడా స్పందించింది.

అలాగే రాహుల్ గాంధీ/కాంగ్రెస్ పార్టీ రతన్ టాటాపై విమర్శలు/సమర్ధించిన సందర్భాల గురించి ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, రాహుల్ గాంధీని ఉద్దేశించి రతన్ టాటా ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll