Fake News, Telugu
 

ప్రపంచ దేశాల వర్గీకరణలో చేసిన మార్పులలో భాగంగా ప్రపంచ బ్యాంకు భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి తొలగించింది, పేద దేశంగా మారినందుకు కాదు

0

ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుండి తొలగించి పేద దేశాల కేటగిరీలో చేర్చిందని చెప్తున్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇప్పుడు పాకిస్తాన్, జాంబియా, ఘనా వంటి దేశాలతో సమానంగా భారత్‌ను ఉంచిందని ఈ వార్తలో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.


ఇలాంటి మరికొన్ని పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుండి తొలగించి పాకిస్తాన్, జాంబియా, ఘనా వంటి దేశాలతో సమానంగా పేద దేశాల కేటగిరీలో చేర్చింది.

ఫాక్ట్(నిజం): 2016లో ప్రపంచ బ్యాంకు అప్పటివరకు ఉన్న ప్రపంచ దేశాల వర్గీకరణలో మార్పులు చేసింది. ప్రపంచ దేశాలను తలసరి ఆదాయం ఆధారంగా వర్గీకరించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే తలసరి ఆదాయం ఆధారంగా భారత్‌ను దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థల కేటగిరీలోకి చేర్చింది. ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం వల్ల భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి తొలగించబడిందన్న వాదన మొదలైంది. ఐతే ప్రపంచ బ్యాంకు లేటెస్ట్ డేటా (2022) ప్రకారం భారత్ తలసరి ఆదాయం ఈ దేశాల కన్నా మెరుగ్గానే ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుండి తొలిగించిన విషయం నిజమే అయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థల వర్గీకరణలో ప్రపంచ బ్యాంకు మార్పులు చేయడం వల్ల ఇలా భారత్ కేటగిరీ మారిందే తప్ప, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారడం వల్ల కాదు.

ప్రపంచ బ్యాంకు 2016 వరకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ‘అభివృద్ధి చెందిన’ మరియు ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాలుగా వర్గీకరిస్తూ వచ్చింది. ఐతే 2016లో ఈ పద్దతిని వదిలేసి ప్రపంచ దేశాలను తలసరి ఆదాయం ఆధారంగా i) తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థలు, ii) దిగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలు, iii) ఎగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలు మరియు iv) అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థలుగా వర్గీకరించడం ప్రారంభించింది.

తలసరి ఆదాయంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్న రెండు దేశాలను ఒకే కేటగిరీలో ఉంచకూడదని ప్రపంచ బ్యాంకు ఈ మార్పులు చేసింది. ఉదాహరణకు, పాత పద్దతిలో మలావి, మెక్సికో రెండు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించబడేవి. కానీ, మలావి తలసరి ఆదాయం $250 కాగా, మెక్సికో తలసరి ఆదాయం $9860. ఇలాంటి వ్యత్యాసాలు తొలగించడానికే ప్రపంచ బ్యాంకు ఈ కొత్త పద్దతిని మొదలుపెట్టింది. ఈ నేపధ్యంలోనే 2016లో ప్రచురించిన ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్‌లో’ పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్దతిలో దేశాలను వర్గీకరించింది.

ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరానికి, తలసరి స్థూల జాతీయ ఆదాయం (GNI per capita) $1,135 లేదా అంతకంటే తక్కువ ఉన్న దేశాలను ‘తక్కువ-ఆదాయ ఆర్థిక వ్యవస్థలుగా’, తలసరి స్థూల జాతీయ ఆదాయం $1,136–$4,465 మధ్య ఉన్న దేశాలను ‘దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థలుగా’, $4,466–$13,845 ఉన్న దేశాలను ‘ఎగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థలుగా’ మరియు $13,846 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలను ‘అధిక-ఆదాయ ఆర్థిక వ్యవస్థలుగా’ విభజించారు.

ఇందులో భాగంగానే తలసరి ఆదాయం ఆధారంగా భారత్‌ను దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థల కేటగిరీలోకి చేర్చింది. ఈ కేటగిరీలోనే పాకిస్తాన్, జాంబియా, ఘనా వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం వల్ల భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి తొలగించబడిందన్న వాదన మొదలైంది. ఐతే ప్రపంచ బ్యాంకు లేటెస్ట్ డేటా ప్రకారం భారత్ తలసరి ఆదాయం ఈ దేశాల కన్నా మెరుగ్గానే ఉంది.

చివరగా, ప్రపంచ దేశాల వర్గీకరణలో మార్పులు చేయడం వల్ల ప్రపంచ బ్యాంకు భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుండి తొలగించింది, పేద దేశంగా మారినందుకు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll