Fake News, Telugu
 

ఫోటోలో ప్రియాంక గాంధీ ఓదారుస్తూన్న వ్యక్తి నక్సలైట్ కాదు, హత్రాస్ బాధితురాలి తల్లి

0

హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ప్రియాంక గాంధీ, ఆ కుటుంబానికి సంబంధం లేని ఒక నక్సలైట్ ని కౌగిలించుకుంటున్న దృశ్యమంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధిత కుటుంబానికి ఎటువంటి సంబంధం లేని ఒకావిడని బాధితురాలి వదిన అంటూ ప్రియాంక గాంధీ కౌగిలించుకొని ఎడిచినట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఫోటోలో కనిపిస్తున్న ఆమె పై హత్య సహా పలు కేసులు ఉన్నాయని, పోలీసులు ఇప్పుడు ఆమె గురించి గాలిస్తున్నారని పోస్టులో పేర్కొన్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

      ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: హత్రాస్ బాధిత కుటుంబానికి సంబంధం లేని ఒక నక్సలైట్ ని ఓదారుస్తున్న ప్రియాంక గాంధీ.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ప్రియాంక గాంధీ ఓదారుస్తున్న వ్యక్తి నక్సలైట్ కాదు, తను హత్రాస్ బాధితురాలి తల్లి. పోస్టులోని మరొక ఫోటోలో కనిపిస్తున్న మహిళ జబులాపూర్ కి చెందిన డాక్టర్ రాజ్ కుమారి బన్సాల్. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

ఫొటో-1:

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘The Economic Times’ న్యూస్ వెబ్ సైట్ వారు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. ప్రియాంక గాంధీ హత్రాస్ బాధితురాలి కుటుంబ సభ్యురాలిని ఓదారుస్తున్న దృశ్యమంటూ ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఆర్టికల్ లో ఈ ఫోటో క్రెడిట్స్ PTI  కి ఇచ్చారు.

హత్రాస్ బాధితురాలి తల్లిని పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలకి సంబంధించిన వీడియోలని వారు తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసారు. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలలో ఆమె ముఖం కనిపించనప్పటికి, పోస్టులోని ఫోటోలో ప్రియాంక గాంధీ ఓదారుస్తున్న ఆవిడ ధరించిన చీరే, బాధితురాలి తల్లి దరించినట్టు గమనించవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో ప్రియాంక గాంధీ ఓదారుస్తున్న వ్యక్తి హత్రాస్ బాధితురాలి తల్లి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫొటో-2:

పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అని అన్వేషిస్తే, ఆవిడ జబల్పూర్ కి చెందిన ఒక డాక్టర్ అని తెలుపుతూ ‘The Wire’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. మధ్యప్రదేశ్  లోని జబల్పూర్ కి చెందిన డాక్టర్ రాజ్ కుమారి బన్సాల్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి హత్రాస్ లోని వారి ఇంటికి వచ్చినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సమయంలోనే ప్రియాంక గాంధీ బాధిత కుటుంబాన్ని ఓదార్చడానికి రావడంతో, రాజ్ కుమారి బన్సాల్ ఫోటోని చూపిస్తూ కొందరు ఆమెని నక్సలైట్ గా చిత్రికరిస్తునట్టు ఆర్టికల్ లో తెలిపారు.

రాజ్ కుమారి బన్సాల్ ‘The Times of India’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనకి ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని, తను కేవలం బాధిత కుటుంబానికి ఓదార్చి, తనవంతు సహాయం చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్టు ఆమె చెప్పారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నక్సలైట్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఫోటోలో ప్రియాంక గాంధీ ఓదారుస్తూన్న వ్యక్తి నక్సలైట్ కాదు, హత్రాస్ బాధితురాలి తల్లి.

Share.

About Author

Comments are closed.

scroll