Fake News, Telugu
 

భారత ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులు దేశం విడిచిపోవాలి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సంబంధంలేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని  48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది.  24 ఏప్రిల్ 2025న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం, భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు తమ వీసాల గడువు ముగిసేలోగా తప్పకుండా దేశం విడిచిపోవాలి. సాధారణ వీసాలకు గడువు 27 ఏప్రిల్ 2025 వరకు, మెడికల్ వీసాలకు గడువు 29 ఏప్రిల్ 2025 వరకు మాత్రమేనని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 48 గంటల గడువు తర్వాత భారీ సంఖ్యలో పాకిస్తానీ ముస్లింలు ముంబై నుంచి వెళ్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచిపోవాలి గడువు ఇచ్చిన నేపథ్యంలో ముంబై నుండి భారీ సంఖ్యలో పాకిస్తానీ ముస్లింలు భారతదేశం విడిచి వెళ్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో ఫిబ్రవరి 2025 నుండి ఆన్ లైన్లో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న ఫిబ్రవరి 2025లో పోస్ట్ చేయబడిన పలు సోషల్ మీడియా పోస్ట్‌లను మాకు లభించాయి (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోలను షేర్ చేస్తూ, ఇది ముంబైలోని ఇజ్తేమా దృశ్యాలను చూపిస్తుందని పేర్కొన్నారు. అంటే, ఈ వీడియో 22 ఏప్రిల్ 2025న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందే ఆన్ లైన్లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

దీని ఆధారంగా, ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్‌ను ఉపయోగించి వెతికినప్పుడు, ఫిబ్రవరి 2025లో ముంబైలో నిర్వహించబడిన ఇజ్తేమాకు సంబంధించిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లభించాయి. ఈ కథనాల ప్రకారం, 2025 ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో ముంబైలోని ఖార్ఘర్‌లో ఇజ్తేమా జరిగినది, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

అయితే మేము ఈ వైరల్ వీడియో ఎప్పడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని కచ్చితంగా ధృవీకరించలేము. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వీడియో పహల్గామ్ దాడికి ముందు నుండే ఆన్ లైన్లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

చివరిగా, భారత ప్రభుత్వం 48 గంటల్లో పాకిస్థాన్ పౌరులు దేశం విడిచిపోవాలి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముంబై నుండి భారీ సంఖ్యలో పాకిస్తానీ ముస్లింలు వెళ్తున్న దృశ్యాలు అంటూ సంబంధంలేని వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll