Fake News, Telugu
 

ఈ వీడియోలో జాతీయ జెండాను అగౌరవపరిచింది భారతదేశంలో నిరసన చేస్తున్న రైతులు కాదు, కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు

0

ఖలిస్తానీ జెండాలను పట్టుకుని, భారత జెండాను బంతికి చుట్టి ఫుట్‌బాల్ ఆడుతున్న ఒక వీడియోను ప్రస్తుతం (2024లో) కొనసాగుతున్న రైతు నిరసనల నేపథ్యంలో షేర్ చేస్తూ, భారతదేశంలో కొనసాగుతున్న రైతు నిరసనల మధ్య రైతులు ఇలా భారత జండాను అవమానిస్తూ ఫుట్‌బాల్ ఆడుతున్నారని పోస్టు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కధనం ద్వారా తెలుసుకుందాం.

ఇదే వీడియోను ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలో ప్రస్తుతం (2024లో) కొనసాగుతున్న రైతు నిరసనల మధ్య రైతులు ఇలా భారత జండాను అవమానిస్తూ ఫుట్‌బాల్ ఆడుతున్నారు, దానికి సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో కెనడాలో జరిగిన సంఘటనది. ఖలిస్తానీ గ్రూపుకు చెందిన ‘హర్దీప్ సింగ్ నిజ్జార్’ హత్యలో భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఖలిస్తానీ మద్దతుదారులు కెనడాలో భారత జెండాను బహిరంగంగా అగౌరవిస్తున్న వీడియో ఇది. భారతదేశంలో ప్రస్తుతం (2024లో) కొనసాగుతున్న నిరసనలకు ఈ వీడియోకు సంబంధం లేదు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, ఈ వీడియో కెనడాలో జరిగినట్టు జులై 2023 నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది అని గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). దీని గురించి డెక్కన్ హెరాల్డ్ వార్తా పత్రిక ఈ వీడియోలోని స్క్రీన్ షాట్ ఒకటి ప్రచురిస్తూ “ఖలిస్తానీ గ్రూపుకు చెందిన ‘హర్దీప్ సింగ్ నిజ్జార్’ హత్యలో భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందని ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఖలిస్తానీ మద్దతుదారులు భారతజెండాను బహిరంగంగా అగౌరవిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది” అని రాసింది అని గమనించాం.

దీని గురించి మరింత వెతకగా, టొరంటోకు చెందిన దేవాన్షు నారంగ్ అనే వ్యక్తి నిరసనకారుల మధ్య నుండి జాతీయ జెండాను తీసివేయడానికి ప్రయత్నించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మేము రోడ్డుకు ఎదురుగా నిలబడి ఉండగా, ఖలిస్తానీ వ్యక్తులు కనిపించారు, భారత జెండా నుండి ఫుట్‌బాల్‌ను సృష్టించి దానితో ఆడటం ప్రారంభించారు. భారత జెండా పట్ల ఇలాంటి అగౌరవం కొనసాగడానికి నేను అనుమతించబోనని పోలీసులకు తెలియజేసి రోడ్డు దాటుకుని వారి వద్దకు వెళ్లాను” అని పోస్ట్ చేసినట్టు గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, ఈ వీడియోలో జాతీయ జెండాను అగౌరవపరిచింది ప్రస్తుతం(2024) భారతదేశంలో నిరసనలు కొనసాగిస్తున్న రైతులు కాదు, కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు.

Share.

About Author

Comments are closed.

scroll