Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకే కాకుండా SC, ST, BC, EBC వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది

0

“తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది” అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇంకా ఈ పోస్టులో ఒక్కో మైనార్టీ విద్యార్థికి 20 లక్షలు ఉపకార వేతనం మరియు విమాన ఖర్చులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.

ఫాక్ట్(నిజం): తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) విద్యార్థులకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా మేము ఈ వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ELECTRONIC PAYMENT AND APPLICATION SYSTEM OF SCHOLARSHIPS (EPASS) వెబ్‌సైట్‌ని పరిశీలించాము. ఈ వెబ్‌సైట్‌లోని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ సర్వీసెస్ అనే విభాగం పరిశీలించగా, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) విద్యార్థులకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోందని తెలిసింది (ఇక్కడ).

SC, ST, BC, మైనారిటీ విద్యార్థులు మరియు అగ్రవర్ణ కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన (EBC) విద్యార్థుల కేటగిరీ క్రింద విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత BC, EBC, మైనారిటీలకు కూడా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రూ. 20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తున్నారు. పది శాతం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు హ్యుమనిటీస్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రిజర్వ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట SC, ST, విద్యార్థులకు, మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పేరిట  BC మరియు EBC విద్యార్థులకు, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం పేరిట మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

ఈ పథకాల మార్గదర్శకాలు క్రింది విధంగా ఉన్నాయి:
a. ఆదాయ ప్రమాణాలు: కుటుంబ ఆదాయం యొక్క వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
b. అర్హత గల దేశాలు: USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ మరియు దక్షిణ కొరియా.
c. స్కాలర్‌షిప్ గ్రాంట్: గరిష్ఠంగా 20 లక్షల వరకు లేదా అడ్మిషన్ లెటర్ లో ఉన్న ఫీజు, ఏది తక్కువగా ఉంటే అంత మొత్తన్ని పొందుతారు. ప్రయాణ ఖర్చు క్రింద వన్ వే ఎకానమీ క్లాస్ టికెట్ మరియు వీసా ఛార్జీలు.
d. ఒక కుటుంబం నుండి ఒకరు మాత్రమే అర్హులు.
e. గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు ఉండాలి, GO ప్రకారం GRE/GMAT మరియు ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్షలో మార్కులు సాధించాలి.

ఈ పథకాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

పలు రిపోర్ట్స్ మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం క్రింద BC, EBC విద్యార్థుల గత రెండు సీజన్ల నుంచి నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నాయి. ఇదే విషయం Epass వెబ్‌సైట్‌ను పరిశీలించగా స్పష్టమైంది. ప్రభుత్వం చివరగా,  2023-February/March లో మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం క్రింద విద్యార్థుల ఎంపిక చేసి స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసింది.

చివరగా, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకే కాకుండా SC, ST, BC, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) విద్యార్థులకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

Share.

About Author

Comments are closed.

scroll