Fake News, Telugu
 

సుప్రీంకోర్టు ఆర్య సమాజ్‌ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం చట్టబద్ధతను ప్రశ్నించిందే తప్ప ఆర్య స‌మాజ్‌లో జరిగిన పెళ్లిని కాదు

0

ఇక నుండి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం కుదరదని, ఎందుకంటే ఆర్య సమాజ్‌లో జారీ చేసిన పెళ్లి సర్టిఫికేట్‌లను గుర్తించబోమని సుప్రీంకోర్టు తెలిపిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మధ్యప్రదేశ్‌కు సంబంధించిన ఒక కేసు విచరణ సందర్భంగా ‘పెళ్ళిళ్ళు చేయడం ఆర్య సమాజ్‌ పని కాదని’ కోర్టు అభిప్రాయపడినట్టు కూడా ఈ వీడియోలో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: సుప్రీంకోర్టు అభిప్రాయం మేరకు ఇకనుండి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం కుదరదు.

ఫాక్ట్(నిజం):  సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో కేవలం ఆర్య సమాజ్‌ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం యొక్క చట్టబద్ధతను ప్రశ్నించిందే తప్ప ఆర్య స‌మాజ్‌లో జరిగిన పెళ్లిని కాదు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఆర్య స‌మాజ్‌లో చేసుకున్న పెళ్లిని చట్టపరంగా గుర్తిస్తారు, కాని ఆర్య స‌మాజ్‌ అందించే మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌కు మాత్రం చట్టబద్దత ఉండదు. పెళ్లి అనంతరం సంబధిత ప్రభుత్వ శాఖ వద్ద పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికీ ఆర్య స‌మాజ్‌లో చేసుకున్న పెళ్లి చేసుకోవచ్చు, కానీ వారు అందించే మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌కు మాత్రం చట్టబద్దత ఉండదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో చెప్తున్న విషయాలు మధ్యప్రదేశ్‌లో ఒక ప్రేమ వివాహానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా జూన్ 2022లో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించింది.

త‌మ కూతురిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడ‌ని మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తిపై అమ్మాయి కుటుంబ స‌భ్యులు పెట్టిన కేసులో ఆ యువ‌కుడు, ఆ యువ‌తి మేజ‌ర్ అని, త‌న ఇష్టంతోనే ఆర్య స‌మాజ్‌లో పెళ్లి చేసుకున్నామ‌ని వాదించాడు. అందుకు సాక్ష్యంగా సెంట్రల్ భార‌తీయ ఆర్య ప్రతినిధి స‌భ జారీ చేసిన వివాహ ధృవ‌ప‌త్రాన్ని చూపించాడు. అయితే, ఈ స‌ర్టిఫికెట్‌ను సుప్రీంకోర్టు అంగీక‌రించ‌లేదు. చట్టబద్ధ సంస్థ జారీ చేసిన ఒరిజిన‌ల్ మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ను త‌మ ముందుంచాల‌ని ఆదేశించింది. వివాహ ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికార పరిధి ఆర్యసమాజ్‌కు లేదని, అది వాళ్ళ పని కూడా కాదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టు వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు:

ఐతే కోర్టు వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు ‘పెళ్ళిళ్ళు చేయడం ఆర్య సమాజ్‌ పని కాదని’ కోర్టు అభిప్రాయపడ్డట్టు వార్తలు షేర్ చేసారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో ‘ఇక నుండి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం కుదరదని’ చేస్తున్న వాదన కూడా కోర్టు వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవడం వల్లే మొదలైంది.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పై కేసులో కోర్టు కేవలం ఆర్య సమాజ్‌ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం యొక్క చట్టబద్ధతను ప్రశ్నించిందే తప్ప ఆర్య స‌మాజ్‌లో జరిగిన పెళ్లిని కాదు.

ఆర్య స‌మాజ్‌లో జరిగిన పెళ్లిని ఇప్పటికి చట్టపరంగా గుర్తిస్తారు:

The Arya Samaj Marriage Validation Act, 1937  కింద ఆర్య స‌మాజ్‌లో జరిగే వివాహాలను చట్టపరంగా గుర్తింపు వచ్చింది. సాధారణంగా ఆర్య స‌మాజ్‌లో జరిగే పెళ్లిళ్లు హిందూ వివాహాలను పోలి ఉంటాయి. హిందూ వివాహ చట్టం, 1955లో పేర్కొన్న సెక్షన్ 7కు అనుగుణంగా ఆర్య స‌మాజ్‌లో కూడా వధూవరులు అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేస్తారు.

కానీ, పెళ్లి అనంతరం ఆర్య స‌మాజ్‌ అందించే మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌కు మాత్రం చట్టబద్దత ఉండదు. ఆర్య స‌మాజ్‌లో పెళ్లి సర్టిఫికేట్ పొందిన తర్వాత సంబధిత ప్రభుత్వ శాఖ వద్ద పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. వధూవరులు ఇద్దరూ హిందువులైతే, హిందూ వివాహ చట్టం, 1955 కింద వివాహ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయాలి. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారైతే Special Marriage Act, 1954 వర్తిస్తుంది.

ఐతే పైన ప్రస్తావించిన కోర్టు తీర్పు ఉద్దేశం కూడా ఇదే. ఆర్య స‌మాజ్‌ అందించిన స‌ర్టిఫికెట్‌ కాకుండా సంబధిత ప్రభుత్వ శాఖ వద్ద పెళ్లిని రిజిస్టర్ చేసుకున్న స‌ర్టిఫికెట్‌ సమర్పించాలని కోర్టు కోరింది. అంతేగానీ ఆర్య స‌మాజ్‌లో చేసుకున్న పెళ్లి చెల్లదని కోర్టు అనలేదు. కాబట్టి ఇప్పటికీ ఆర్య స‌మాజ్‌లో చేసుకున్న పెళ్లిని చట్టపరంగా గుర్తిస్తారని అర్ధం చేసుకోవాలి.

చివరగా, సుప్రీంకోర్టు ఆర్య సమాజ్‌ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం చట్టబద్ధతను ప్రశ్నించిందే తప్ప ఆర్య స‌మాజ్‌లో జరిగిన పెళ్లిని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll