Fake News, Telugu
 

గణతంత్ర దినోత్సవం రోజు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కశ్మీర్‌కు వస్తానని మోదీ ఛాలెంజ్ చేసినట్టు ఒక సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

0

మరో రెండు రోజుల్లో దేశం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ  బహిరంగ ఛాలెంజ్ విసిరాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ‘26 జనవరి నాడు తాను కాశ్మీర్‌లోని లాల్ చౌక్ వద్దకు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సెక్యూరిటీ గానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ గానీ లేకుండా వస్తున్నానని, తనను ఎవరైనా ఆపొచ్చు’ అంటూ మోదీ ఛాలెంజ్ చేసినట్టు ఈ వీడియోను షేర్ చేసిన పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు.  ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: గణతంత్ర దినోత్సవం నాడు తాను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కశ్మీర్‌లోని లాల్ చౌక్ వద్దకు వస్తానని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ఛాలెంజ్ చేసిన వీడియో.

ఫాక్ట్(నిజం): 2023 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో 1991లో జమ్మూకశ్మీర్‌లో తాను చేసిన ఏక్తా యాత్ర సందర్భంగా ఉగ్రవాదుల బెదిరింపులకు తాను స్పందించిన తీరును గుర్తు చేసుకొనే క్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలకి రాబోయే గణతంత్ర దినోత్సవానికి ఎటువంటి సంబంధం లేదు. పైగా రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని మోదీ కశ్మీర్‌లో జరుపుకోనున్నట్టు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలోని వ్యాఖ్యలు ప్రధాని మోదీ నిజంగానే చేసినప్పటికీ, అవి రాబోయే రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కావు. 20వ శతాబ్దం చివర్లో తాను కశ్మీర్‌లోని  నిర్వహించిన ఏక్తా యాత్రను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కావు.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా 11 ఫిబ్రవరి 2023 నాడు పార్లమెంట్‌లో మోదీ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో మాకు కనిపించింది. ఈ ప్రసంగంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ 1991లో జమ్మూకశ్మీర్‌లో తాను చేసిన ఏక్తా యాత్రను మోదీ గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాద బెదిరింపుల మధ్య భద్రత లేకుండా జమ్మూలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశానని మోదీ వ్యాఖ్యానించాడు.

ఈ క్రమంలోనే మాట్లాడుతూ ‘ఉగ్రవాదులు నన్ను చంపుతామని బెదిరిస్తూ పోస్టర్లు వేశారని, దీనికి బదులుగా ‘26 జనవరి నాడు ఉదయం 11 గంటలకు నేను సెక్యూరిటీ లేకుండా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ లేకుండా లాల్‌ చౌక్‌కు చేరుకుంటాను’ అని వారికి ఛాలెంజ్ చేసి, ఆ తర్వాత లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించానని’ మోదీ గుర్తు చేసుకున్నారు.

మోదీ పార్లమెంట్‌లో చేసిన ఈ ప్రసంగాన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి, ఈ కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇదిలా ఉండగా రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని మోదీ కశ్మీర్‌లో జరుపుకోనున్నట్టు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేవు. దీన్నిబట్టి మోదీ గతంలో వేరే సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సందర్భరహితంగా షేర్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, గణతంత్ర దినోత్సవం రోజు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కాశ్మీర్‌కు వస్తానని ప్రధాని మోదీ ఛాలెంజ్ చేసినట్టు ఒక సంబంధం లేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll