శ్రీ రామ నవమి శోభాయాత్రలో హిందువుల మీద రాళ్ళు రువ్విన ముస్లింలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎలా శిక్షిస్తున్నారో చూడండి, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. కొందరు ముస్లింలు చెవులు, కాళ్లు పట్టుకొని మైదానంలోని ఒక చెట్టు చుట్టూ గుంజీలు తీస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం శ్రీ రామ నవమి శోభాయాత్రలో రాళ్ళు రువ్విన ముస్లింలని శిక్షిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాకిస్థాన్ దేశంలో జరిగిన ఒక పాత సంఘటనని చూపిస్తుంది. 2020 మార్చి నెలలో లాక్‌డౌన్ నియమాలని ఉల్లంఘించిన వారిని పాకిస్తాన్ లోని మన్సేహర పోలీసులు ఇలా చెట్టు చుట్టూ గుంజీలు తీయించారు. పోస్టులో షేర్ చేసిన వీడియోకి ఇటీవల శ్రీ రామ నవమి శోభాయాత్రలో రాళ్ళు రువ్విన సంఘటనకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ఉర్దూ అప్డేట్స్’ అనే యూట్యూబ్ ఛానల్ 29 మార్చి 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. లాక్‌డౌన్ నియమాలని ఉల్లంఘించిన వారిని మన్సేహర పోలీసులు శిక్షిస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు.
ఈ ఘటనని విమర్శిస్తూ పెట్టిన ఒక ట్వీట్‌కి మన్సేహర పోలీసులు స్పందిస్తూ, “ఈ ఘటనకి సంబంధించి హజార ప్రావిన్స్ డీఐజీ, మన్సేహర డిపివోను ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అధికార దుర్వినియోగం, మానవత్వాన్ని కించపరిచే చర్యలేవి తాము సహించేది లేదని డీఐజీ ఖాజీ పేర్కొన్నారు”, అని ట్వీట్ పెట్టారు . దీన్ని బట్టి, వీడియోలోని ఘటన పాకిస్థాన్ దేశంలోని మన్సేహర నగరంలో చోటుచేసుకుందని స్పష్టమయ్యింది.
ఈ ఘటనకి సంబంధించి పలు పాకిస్థాన్ వార్తా సంస్థ 2020 మార్చి నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన అల్లర్ల ఘటనకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, పాకిస్థాన్‌కి సంబంధించిన పాత వీడియోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం శ్రీ రామ నవమి శోభాయాత్రలో రాళ్ళు రువ్విన ముస్లింలని శిక్షిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.