‘నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎలక్షన్స్ ని రద్దు చేయాలంటూ’ సుప్రీం కోర్ట్ ఆదేశించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎలక్షన్స్ ని రద్దు చేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశం
ఫాక్ట్ (నిజం): ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువగా ఓట్లు నమోదైతే అప్పుడు ఆ ఎన్నిక రద్దు చేసి మళ్ళి కొత్తగా ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టులో ఒక PIL (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. ఐతే సుప్రీం కోర్టు దీనిపై స్పందిస్తూ ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాని ఆర్టికల్ 324 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసి తాజా ఎన్నికలు నిర్వహించగలిగే సాధ్యనుసాధ్యాలను పరిశీలించి స్పందించాలని ECI మరియు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఐతే ఈ నోటీసుని ‘నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎలక్షన్స్ ని రద్దు చేయాలంటూ’ సుప్రీం కోర్టు ఆదేశించినట్టు తప్పుగా అర్ధం చేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇటీవల అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువగా ఓట్లు నమోదైతే అప్పుడు ఆ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టులో ఒక PIL (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేసాడు. పైగా ప్రజలు తిరస్కరించిన అభ్యర్ధులను మళ్ళీ తిరిగి నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయనీకూడదని పిటిషనర్ కోరాడు. ఐతే సుప్రీం కోర్ట్ ఈ PILకి స్పందిస్తూ ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాని ఆర్టికల్ 324 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసి తాజా ఎన్నికలు నిర్వహించగలిగే సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్పందించాలని ECI మరియు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ PIL కి సంబంధించిన సారాంశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ నోటీసుని ‘నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎలక్షన్స్ ని రద్దు చేయాలంటూ’ సుప్రీం కోర్టు ఆదేశించినట్టు తప్పుగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ది హిందూ, టైమ్స్ అఫ్ ఇండియా కూడా ఈ విషయానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఐతే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎలక్షన్స్ ని రద్దు చేయాలంటూ ఎటువంటి చట్టాలు లేవు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలలో Section 65 of the Representation of the People Act, 1951 మరియు ప్రకారం Clause (a) of Rule 64 of Conduct of Election Rules, 1961 ప్రకారం ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడతాయో తనను గెలిచినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తరు. పోటిలో ఉన్న అభ్యర్ధులు ఎవరూ తమకు నచ్చనప్పుడు ఓటర్లకు వీలుగా EVM మరియు పేపర్ బ్యాలెట్ పై NOTA ఆప్షన్ కల్పించాలని 2013లో సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ‘NOTA’ మీద వివరణ ఇస్తూ ఒక వేళ ‘NOTA’ కి మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువ ఓట్లు పడినా కూడా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో తనని గెలిచిన అభ్యర్థిగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారు అని స్పష్టం చేసింది.
ఐతే కొన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్లు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలలో NOTA ని ఒక పోటీలో ఉన్న అభ్యర్ధిగా పరిగణిస్తున్నాయి. ఒక వేళ పోటిలో ఉన్న అభ్యర్ధులకన్నా NOTA కి ఎక్కువ ఓట్లు వస్తే అప్పడు జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఉదాహారణకి సుప్రీం కోర్టు 2013 NOTA కి సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2018లో ఇలానే చేయాలని నిర్ణయించింది. కాకపొతే ఈ విధానం అన్ని రాష్ట్రాల్లో లేదు.
NOTA ప్రవేశ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ రాష్త్రాలలో మరియు ఎన్నికలలో NOTA కి పోల్ అయిన వోట్లకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని (డేటా) FACTLY డాష్ బోర్డులో అందుబాటులోకి తీసుకొచ్చింది, ఈ సమాచారాన్ని ఇక్కడ చూడొచ్చు. అలాగే NOTA కి సంబంధించి FACTLY రాసిన పలు కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, బరిలో ఉన్న అభ్యర్దులకన్నా NOTAకి ఎక్కువ వోట్లు వచ్చినప్పుడు ఆ ఎన్నికలని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించలేదు, కేవలం సాధ్యాసాధ్యాలను పరిశీలలించాలని కోరింది.