‘మా దేశం మీద ప్రపంచంలోని ప్రతి దేశం దాడులు జరిపారు, మూడు సార్లు ఆక్రమణకు గురైంది, మా ప్రజలు దేశం విడిచి వివిధ దేశాల్లో తలదాచుకున్నారు, అన్ని దేశాలు మా సంస్కృతిని దెబ్బ తీసారు, నానా చిత్రహింసలకు గురి చేశారు, మమ్మల్ని బానిసలుగా చూశారు కానీ ఒకే ఒక్క దేశం మాత్రం మమ్మల్ని, మమ్మల్ని గానే చూశారు, అక్కున చేర్చుకున్నారు, ఎంతో గౌరవించారు, తిండి పెట్టారు, ఆదరించారు, ఆశ్రయమిచ్చారు, మాకు ప్రపంచంలోగుర్తింపునిచ్చారు, మా దేశానికి స్వాతంత్య్రం రాగానే మమ్మల్ని సాదరంగా మా దేశానికి పంపించారు…. ఆ దేశం భారతదేశం’ అని ఇజ్రాయెల్ దేశ రాజ్యాంగం యొక్క మొట్ట మొదటి పేజీలో రాసి ఉంటుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇజ్రాయెల్ దేశ రాజ్యాంగం యొక్క మొట్ట మొదటి పేజీలో భారత దేశం గురించి గొప్పగా రాసారు.
ఫాక్ట్(నిజం): ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటి వరకు ఒక వ్రాతపూర్వక రాజ్యాంగం (Written Constitution) లేదు. 1948 నుండి అధికారిక రాజ్యాంగాన్ని రూపొందించడానికి వివిధ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇప్పటి ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. 2003 మే లో ఇజ్రాయెల్ పార్లమెంట్ (Knesset) యొక్క ‘the Constitution, Law, and Justice’ కమిటీ ఇజ్రాయెల్ కి ఒక వ్రాతపూర్వక రాజ్యాంగాన్ని అందించే ఉద్దేశంతో ‘Constitution by Broad Consensus’ అనే ప్రాజెక్ట్ మొదలుపెట్టింది, అప్పటి నుండి ఈ కమిటీ వారానికొకసారి సమావేశమవుతోంది. ఇజ్రాయెల్ దేశానికి ఒక వ్రాతపూర్వక రాజ్యాంగం లేదు, కాబట్టి ఇజ్రాయెల్ రాజ్యాంగం భారత దేశాన్ని పొగుడుతూ రాసారన్న వాదన తలెత్తదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇజ్రాయెల్ రాజ్యాంగానికి సంబంధించిన అధికారిక వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటి వరకు ఒక వ్రాతపూర్వక రాజ్యాంగం (Written Constitution) లేదు. 1948 నుండి అధికారిక రాజ్యాంగాన్ని రూపొందించడానికి వివిధ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇప్పటి ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. బదులుగా ఇజ్రాయెల్ ప్రాథమిక చట్టాలు మరియు హక్కుల వ్యవస్థను అభివృద్ధి చేసింది, ఇవి పాక్షిక రాజ్యాంగ హోదాను అనుభవిస్తున్నాయి.
2003 మే లో ఇజ్రాయెల్ పార్లమెంట్ (Knesset) యొక్క ‘the Constitution, Law, and Justice’ కమిటీ ఇజ్రాయెల్ కి ఒక వ్రాతపూర్వక రాజ్యాంగాన్ని అందించే ఉద్దేశంతో ‘Constitution by Broad Consensus’ అనే ప్రాజెక్ట్ మొదలుపెట్టింది, అప్పటి నుండి ఈ కమిటీ వారానికొకసారి సమావేశమవుతోంది. దీన్నిబట్టి ఇజ్రాయెల్ రాజ్యాంగం యొక్క మొదటి పేజీలో భారత దేశాన్ని పొగుడుతూ రాసి ఉంటుందన్న వాదనలో నిజంలేదని రుజువైతుంది.
ఐతే ఇండియా టుడే 2018లో రాసిన ఒక కథనం ప్రకారం భారత దేశంలో యూదులు (Jews) 2,000 సంవత్సరాలకు పైగా ఎటువంటి వివక్ష లేకుండా నివసిస్తున్నారని పేర్కొంది. 1948లో యూదులకు ప్రత్యేక దేశం (ఇజ్రాయెల్) ఏర్పడ్డాక సుమారు 70,000 మంది యూదులు ఇజ్రాయెల్ కి వెళ్లిపోయారని పైగా 2000 సెన్సస్ ప్రకారం భారత దేశంలో యూదుల జనాభా 4,650 గా ఉన్నట్టు తెలిపింది.
అయితే, 2015లో భారత దేశంలో ఇజ్రాయెల్ రాయబారి అయినా డేనియల్ కార్మోన్ మాట్లాడుతూ, భారత దేశంలో గత 2000 ఏళ్లుగా యూదులు ఎటువంటి వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు అని అన్నట్టు ఢిల్లీ ఇజ్రాయెల్ ఎంబసీ వెబ్సైటు లో రాసి ఉన్నట్టు చూడొచ్చు.
చివరగా, ఇజ్రాయెల్ దేశానికి ఒక వ్రాతపూర్వక రాజ్యాంగం లేదు, కాబట్టి ఇజ్రాయెల్ రాజ్యాంగం భారత దేశాన్ని పొగుడుతూ రాసారన్న వాదన తప్పు.