“మేఘాలయలోని ఒక్క గ్రామంలో ప్రతి 100 మంది అమ్మాయిలకు 30 మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు, అందువల్లన అక్కడ అమ్మాయిలు అబ్బాయి నాకు కావాలంటే నాకు కావాలి అని పోటీపడ్డారు, ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్ళి చేస్తారు” అని చెప్తూ ఓ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో అమ్మాయిల గుంపుతో ఒక అబ్బాయి పెనుగులాట మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మేఘాలయలోని ఓ గ్రామంలో అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం పోటీపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు భారతదేశానికి సంబంధించినవి కావు. ఈ వీడియో ఇండోనేషియాకు చెందినది. ఈ వీడియోలో ఉన్నది ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో నిర్వహించబడే మెగెబురాన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సంప్రదాయానికి సంబంధించిన దృశ్యాలు. మెగెబురాన్ సంప్రదాయం బాలిలోని బులెలెంగ్ రీజెన్సీలోని సావాన్ జిల్లా, సెకుంపుల్ గ్రామంలో జరుగుతుంది. స్థానిక సెకా టెరునా తెగకి చెందిన యువత ఇందులో పాల్గొంటారు. మెగెబురాన్ అంటే ఇండోనేషియన్ భాషలో చిమ్మడం అని అర్థం. సెకుంపుల్ గ్రామ పెద్ద ప్రకారం, మెగాబురాన్‌లో పాల్గొనేవారిని అమ్మాయిలు, అబ్బాయిలు గ్రూపులుగా విభజిస్తారు. ఈ మెగాబురాన్‌లో పాల్గొనేవారి కనీస వయస్సు 13 సంవత్సరాలు మరియు వారు అవివాహితులై ఉండాలి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగిన అధిక నిడివి గల వీడియోను ‘King Purwa’ అనే X(ట్విట్టర్) ఖాతా షేర్ చేసినట్లు మేము గుర్తించాము. ఈ వీడియో యొక్క కామెంట్స్ విభాగంలో ఈ వీడియో ఇండోనేషియాలోని బాలికి చెందిన మెగెబురాన్ సంప్రదాయానికి సంబంధించినదని పేర్కొనబడింది. అలాగే మెగెబురాన్ సంప్రదాయం గురించి వివరించే ఒక ఆర్టికల్ లింక్ కూడా షేర్ చేశారు.
ఈ ఆర్టికల్ ప్రకారం (ఆర్కైవ్డ్ లింక్), బాలిలో మెగెబురాన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయంలో యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు పోట్లాడుకుంటారు. మెగెబురాన్ సంప్రదాయం బాలిలోని బులెలెంగ్ రీజెన్సీలోని సావాన్ జిల్లా, సెకుంపుల్ గ్రామంలో జరుగుతుంది. స్థానిక సెకా టెరునా తెగకి చెందిన యువత ఇందులో పాల్గొంటారు. మెగెబురాన్ అంటే ఇండోనేషియన్ భాషలో చిమ్మడం అని అర్థం. సెకుంపుల్ గ్రామ పెద్ద ప్రకారం, మెగాబురాన్‌లో పాల్గొనేవారిని అమ్మాయిలు, అబ్బాయిలు గ్రూపులుగా విభజిస్తారు. ఈ మెగాబురాన్‌లో పాల్గొనేవారి కనీస వయస్సు 13 సంవత్సరాలు మరియు వారు అవివాహితులై ఉండాలి.
సాధారణంగా, ఈ సంప్రదాయంలో పాల్గొనేవారు సెకా టెరునాలోని యువత, వీరు సెకా టెరునాలో కొత్త సభ్యులు. ఈ మెగెబురాన్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే, సెకా టెరునా సభ్యుల మధ్య ఐక్యతా భావాన్ని పెంచడం అలాగే ఈ సంప్రదాయం వల్లన వీరు సెకా టెరునాకి సంబంధించిన కార్యక్రమాలను, ఆలయంలో వారి బాధ్యతలను నిర్వహించగలుగుతారు.
ఆలయంలో తమ బాధ్యతలు మరియు కార్యకలాపాలను నిర్వహించే ముందు సెకా టెరునాలో చేరిన కొత్త సెకా టెరునాలో సభ్యులు, పవిత్రమైన నీటిలో మునగడం ద్వారా తమను తాము శుద్ధి చేసుకుంటారు. ఈ సంప్రదాయం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి పియోడలన్ లేదా పూజావళి సమయంలో సెకుంపుల్ గ్రామంలోని దేవాలయం వద్ద జరుగుతుందని సెకుంపుల్ గ్రామ పెద్ద పేర్కొన్నారు.
ఈ మెగాబురాన్‌లో పాల్గొనేవారు సెకంపుల్ గ్రామ దేవాలయం వద్దకు వచ్చి, అక్కడ నుండి అందరూ కలిసి కాలినడకన తమన్ దరి అనే నీటి గుంట వద్దకు బయలుదేరతారు. తమన్ దరి వద్దకు చేరాక, జెరో మాంగ్కు (బాలీలోని హిందూ నాయకుడు) ముందుగా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఓ అడ్డుగోడతో రెండు గ్రూపులుగా విడిపోయిన స్త్రీ పురుషులు నీటి గుంటలోకి దిగుతారు. మొదట్లో స్త్రీ, పురుషులు ఒకరిపై ఒకరు బురద కలిపిన నీటిని విసురుకుంటారు, ఆతర్వాత మహిళలంతా పురుషుల శిబిరంలోకి దూసుకెళ్లతారు. ఈ క్రమంలో మహిళల నుండి పురుషులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఈ మెగాబురాన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. మెగాబురాన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ వీడియోలోని దృశ్యాలు ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో నిర్వహించబడే మెగెబురాన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సంప్రదాయానికి సంబంధించినవి.