Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

జనతా కర్ఫ్యూ: చప్పట్లు కొడితే కొరోనా వైరస్ తన శక్తిని కోల్పోదు. చప్పట్లు సంఘీభావం తెలపడానికి మాత్రమే

1

మార్చి 22 (జనతా కర్ఫ్యూ) రోజున ఐదు గంటలకు చప్పట్లు కొట్టమని ప్రధాని మోడీ చెప్పడానికి వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉందని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. కోవిడ్-19 వ్యాధిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్న వైద్యులకు మరియు ఇతర సిబ్బందికి సంఘీభావంగా ప్రజలంతా మార్చి 22 న  సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టమని ప్రధాని మోడీ కోరారు. అయితే, చప్పట్లు కొట్టడం వల్ల వచ్చే వైబ్రేషన్ల ద్వారా కొరోనా వైరస్ తన శక్తిని కోల్పోతుందని, అందుకే మోడీ చప్పట్లు కొట్టమన్నాడని కొందరు పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, మార్చి 22 న అమావాస్య కాబట్టి ఆ రోజున చప్పట్లు కొట్టాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఐదు గంటలకు చప్పట్లు కొట్టమని మోడీ చెప్పడానికి వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉంది. చప్పట్ల వైబ్రేషన్ల ద్వారా కొరోనా వైరస్ తన శక్తిని కోల్పోతుంది. మార్చి 22 న ఆమావాస్య కూడా.

ఫాక్ట్ (నిజం): చప్పట్ల వైబ్రేషన్ల ద్వారా కొరోనా వైరస్ తన శక్తిని కోల్పోతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని చెప్పారు. అంతేకాదు, మార్చి 22 న అమావాస్య కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

జ్యోతిష శాస్త్ర క్లెయిమ్:

మొదట, అమావాస్య ఏ రోజో చూద్దాం. ఆ విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, 22 మార్చి 2020 న అమావాస్య కాదని, 23 మార్చి 2020 (12:30 PM) – 24 మార్చి 2020 (02:58 PM) అని తెలుస్తుంది. కాబట్టి, ‘మార్చి 22 అమావాస్య, ఒక నెలలో చీకటి రోజు. అన్ని వైరస్, బ్యాక్టీరియా మరియు దుష్ట శక్తులు అటువంటి రోజుల్లో గరిష్ట సామర్థ్యాన్ని మరియు శక్తిని కలిగి ఉంటాయి’  అని పోస్టులో చెప్పిన కథ మార్చి 22 రోజుకు వర్తించదు,  ఎందుకంటే ఆ రోజు అమవస్య కాదు. అలాగే, రేవతి నక్షత్రం కూడా 25 మార్చి 2020 (04:19 AM) – మార్చి 26 మార్చి 2020 (07:16 AM). అవే తేదీలు (మార్చి 24 న అమవస్య, మార్చి 25 న రేవతి నక్షత్రం) ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. కాబట్టి, పోస్ట్‌లో పేర్కొన్న జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత అబద్ధం.

శాస్త్రియపరమైన ఆధారం:

ఇప్పుడు, చప్పట్ల వల్ల కొరోనా వైరస్ శక్తిని కోల్పోతుందని నిరూపించడానికి ఏవైనా శాస్త్రీయపరమైన ఆధారాలు ఉన్నాయో లేదో చూద్దాం. బ్యాక్టీరియా, వైరస్ మరియు క్యాన్సర్ కణాలను చంపడానికి అల్ట్రాసౌండ్ మరియు లేజర్ కిరణాలు పనిచేస్తాయో లేదో అని ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనలు జరుగుతున్నట్టు ఇంటర్నెట్ లో ఆర్టికల్స్ చూడవొచ్చు. కానీ, చప్పట్లు నుండి వచ్చే వైబ్రేషన్ల ద్వారా కరోనా వైరస్ శక్తిని కోల్పోతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయపరమైన ఆధారాలు దొరకలేదు. చప్పట్లు కొట్టడం నుండి వచ్చే వైబ్రేషన్ల ద్వారా వైరస్ శక్తిని కోల్పోతే, WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) కూడా చపట్లు కొట్టమని సూచించేది. కానీ, WHO వెబ్‌సైట్‌లో అలాంటి నివారణ మార్గదర్శకాలు లేవు. అలాగే, పోస్టులోని మెసేజ్ వైరల్ అవ్వడంతో, ‘చప్పట్లు కొట్టడం ద్వారా ఉత్పన్నమయ్యే వైబ్రేషన్లు కరోనా వైరస్ ను నాశనం చేయలేదు’ అని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది

చివరగా, చప్పట్లు కొడితే కొరోనా వైరస్ తన శక్తిని కోల్పోదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll