ఇటీవలే 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీలు 24 జూన్ 2024న ప్రారంభమయ్యే 18వ లోక్‌సభ మొదటి సెషన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 18వ లోక్‌సభ మొదటి సెషన్ 24 జూన్ 2024న నుండి 03 జూలై 2024 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించారు.
ఫాక్ట్(నిజం): I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించలేదు. 18వ లోక్‌సభ మొదటి సెషన్ కు సంబంధించి మొదటి రోజు మరియు రెండో రోజు జరిగిన సమవేశాల యొక్క ప్రొసీడింగ్స్ రికార్డ్స్ ప్రకారం, 18వ లోక్‌సభ మొదటి సెషన్ మొదటి రోజు అనగా 24 జూన్ 2024న 262 మంది ఎంపీలు, రెండో రోజు అనగా 25 జూన్ 2024న 272 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. 25 జూన్ 2024 నాటికీ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో కలుపుకొన్ని మొత్తం 535 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాలతో 07 ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
18వ లోక్‌సభ మొదటి సెషన్ 24 జూన్ 2024న నుండి 03 జూలై 2024 వరకు జరగనున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, మొదటి రెండు రోజులు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 26 జూన్ 2024న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అలాగే, 24 జూన్ 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ నియమించబడ్డారు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, మాకు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించి ఉంటే పలు మీడియా సంస్థలు కచ్చితంగా రిపోర్టు చేసి ఉండేవి.
తదుపరి మేము లోక్‌సభ అధికారిక వెబ్సైటులో, 18వ లోక్‌సభ మొదటి సెషన్ కు సంబంధించి మొదటి రోజు మరియు రెండో రోజు జరిగిన సమవేశాల యొక్క ప్రొసీడింగ్స్ రికార్డ్ పరిశీలించాము.(ఇక్కడ & ఇక్కడ). ఈ రికార్డ్స్ ప్రకారం, 18వ లోక్‌సభ మొదటి సెషన్ మొదటి రోజు అనగా 24 జూన్ 2024న 262 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు, రెండో రోజు అనగా 25 జూన్ 2024న 272 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో కలుపుకొన్ని మొత్తం 535 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను మనం లోక్‌సభ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ‘సన్సద్ టీవీ'(Sansad TV)లో చూడవచ్చు (ఇక్కడ).

రెండోవ రోజు అనగా 25 జూన్ 2024న జరిగిన సమవేశం తరువాత ఇంకా 07 ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నటుడు-రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా, టిఎంసికి చెందిన దీపక్ అధికారి మరియు నూరుల్ ఇస్లాం, సమాజ్ వాదీ పార్టీకి చెందిన అఫ్జల్ అన్సారీ. ఇద్దరు స్వతంత్ర నాయకులు- బారాముల్లా ఎంపి ఇంజనీర్ రషీద్ మరియు ఖదూర్ సాహిబ్ ఎంపీ అమృతపాల్ సింగ్(వీరు ఇద్దరు జైలులో ఉన్నారు). దీన్ని బట్టి I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించారు అనే వాదనలో నిజంలేదు అని మనం నిర్థారించవచ్చు.
ఈ క్రమంలోనే, మాకు ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది విభోర్ ప్రతిపక్ష ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలిపివేయాలని కోరతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారని చెప్తున్న పలు ధృవీకరించబడని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). మేము కూడా ఈ వార్తలో ఎంత నిజముందో నిర్ధారించలేకపోయాము.
చివరగా, I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించారు అనే వాదనలో నిజంలేదు, ఈ వైరల్ పోస్టు ఫేక్.