‘కేరళ రాష్ట్రం (సీపీఐ) రాష్ట్ర మంత్రి రాజన్ గారు సాధారణ టీ స్టాల్ వద్ద కూర్చొని అందరితో కలిసి పాట పాడుతూ హాయిగా ఉన్నాడు’ అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి పాట పాడుతుండగా పక్కన ఉన్న కొంతమంది బెంచ్ పైన దరువు వాయిస్తూ కనిపిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళలోని ఒక టీ స్టాల్ లో కూర్చొని పాట పాడుతున్న ఆ రాష్ట్ర మంత్రి రాజన్.
ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న వీడియో క్లిప్, ‘కేరళ ఫుడీ’ అనే ఫుడ్ వ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వ్లాగ్ లోనిది. తను ఈ వీడియోని కేరళలోని కుమారకోంలో ఉన్న ‘కీరికులీ తెంగింతోప్పు’ అనే హొటల్‌లో చిత్రీకరించాడు. అక్కడ కొంతమంది కస్టమర్స్ సాయంకాలవేళ ఆ హోటల్‌లో పాటలు పాడుకుంటూ గడుపుతారని అతను వ్లాగ్‌లో చెప్పాడు. పాడుతున్న వ్యక్తి కేరళ మంత్రి రాజన్ అని వీడియో మొత్తంలో ఎక్కడా కూడా చెప్పలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వీడియోలో ‘కేరళ ఫుడీ’ అనే వాటర్ మార్క్ గమనించి ఇంటర్నెట్లో ఆ పేరుతో సెర్చ్ చేసాము. అదే పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ మరియు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఈ రెండు ఒక ఫుడ్ వ్లాగర్ మరియు ట్రావెలర్ కి సంబంధించినవి. పోస్టులో ఉన్న వీడియో కోసం వీటిలో వెతకగా, ‘కేరళ ఫుడీ’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో జూన్ 7వ తారీఖున అప్లోడ్ చేసిన వీడియోలో పోస్టులో ఉన్నట్టుగా ఒక వ్యక్తి పాట పాడుతుంటే కొందరు దరువు వేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
కేరళ ఫుడీ, కేరళలోని కుమారకోంలో ఉన్న ‘కీరికులీ తెంగింతోప్పు’ అనే హొటల్‌లో ఈ వ్లాగ్ చిత్రీకరించాడు. అక్క కొంతమంది సాయంత్రం వేళ ఇలా వచ్చి పాటలు పాడుతూ తమ సమయాన్ని గడుపుతారని వీడియోలో చెప్పాడు. తను వీడియో మొత్తంలో ఎక్కడా కూడా పాట పడుతున్న వ్యక్తి కేరళ మంత్రి అని చెప్పలేదు.
అసలు రాజన్ అనే మంత్రి ఎవరైనా కేరళ క్యాబినెట్లో ఉన్నారా అని ఇంటర్నెట్లో వెతకగా, కె. రాజన్ అనే సీపీఐ పార్టీ యొక్క మంత్రి ఉన్నారని తెలిసింది. ఈయన కేరళ రాష్ట్ర హౌసింగ్ మరియు రెవిన్యూ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన గురించి మరింత సమాచారం మీరు ఇక్కడ మరియు ఇక్కడ పొందవచ్చు. మంత్రి రాజన్ ఇలా పాట పాడరా అని ఏమైనా వార్తా కథనాలు ఉన్నాయా అని ఇంటర్నెట్లో వెతకగా, ఎటువంటి సమాచారం లభించలేదు. అసలు ఈ వైరల్ వీడియోలో పాట పాడుతున్న వ్యక్తి ఎవరు అని ‘కేరళ ఫుడీ’కి తన ఈ మెయిల్ ద్వారా సంప్రదించగా, తను ఆ వ్యక్తి పేరు మోహనన్ అని, కే.రాజన్ కాదు అని స్పష్టం చేసాడు.
మోహనన్ మరియు ఆయన బృందం గురించి కారైకాల్ న్యూస్ వారు ఒక వార్త కథనాన్ని చేసారు, ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు. అంతే కాకుండా, మోహనన్ తన బృందంతో కలిసి మోనోరమా టీవి వారి ఒక షో లో పాట పాడారు. ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ వీడియోలో పాట పాడుతున్న వ్యక్తి కేరళ మంత్రి రాజన్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.