Fake News, Telugu
 

కవితను విడుదల చేయకపోతే తాను పెట్రోల్ పోసుకుంటానని హరీష్ రావు బెదిరించాడని చెప్తున్న ఈ న్యూస్ క్లిప్‌ ఫేక్

0

ఇటీవల ఢిల్లీ మద్యం పాలసీ కేసులో BRS నాయకురాలు కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవితను విడుదల చేయకపోతే తాను పెట్రోల్ పోసుకుంటానని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు ‘నా తెలంగాణ’ అనే పత్రిక రిపోర్ట్ చేసినట్టు ఉన్న ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కవితను విడుదల చేయకపోతే తాను పెట్రోల్ పోసుకుంటానని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు – ‘నా తెలంగాణ’ న్యూస్ క్లిప్.

ఫాక్ట్(నిజం): కవిత అరెస్ట్ నేపథ్యంలో హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలేవి చేయలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న క్లిప్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఢిల్లీ మద్యం విధానం కేసు వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసారు. ఐతే ఈ నేపథ్యంలో కవితను విడుదల చేయకపోతే తాను పెట్రోల్ పోసుకుంటానని మాజీ మంత్రి హరీష్ రావు బెదిరించాడన్న వార్తలో నిజం లేదు.

ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో ఈ వార్తకు సంబంధించి అందించిన లింక్ ఆధారంగా వెతకగా ప్రధాని మోదీ బెంగాల్‌లో నిర్వహించిన సభకు సంబంధించిన వార్త మాకు కనిపించింది. పైగా ఈ వార్త 02 మార్చ్ 2024 నాడు ప్రచురితమైంది. అలాగే వైరల్ క్లిప్‌లోని డేట్ ఆధారంగా వెతకగా 17 మార్చ్ 2024 నాడు ‘నా తెలంగాణ’ ఇలాంటి వార్త ఏదీ ప్రచురించలేదని తెలిసింది. దీన్నిబట్టి మోదీ బెంగాల్‌ సభకు సంబంధించిన న్యూస్ క్లిప్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి ఈ వ్యాఖ్యలను హరీష్ రావుకు తప్పుగా ఆపాదించినట్టు స్పష్టమవుతుంది.

ఒకవేళ హరీష్ రావు నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, అన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవీ కనిపించలేదు. కాగా కవిత అరెస్ట్ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు, ఐతే ఈ సమావేశంలో వైరల్ క్లిప్‌లో చెప్తున్న వ్యాఖ్యలేవి చేయలేదు.

చివరగా, కవితను విడుదల చేయకపోతే తాను పెట్రోల్ పోసుకుంటానని హరీష్ బెదిరించాడని చెప్తున్న ఈ న్యూస్ క్లిప్‌ ఫేక్

Share.

About Author

Comments are closed.

scroll