“ఒకప్పటి మిస్ వరల్డ్ నిషా గామిరే క్యాన్సర్ బారిన పడి చివరకు ఇలా మంచాన పడి మరణించింది” అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియా బాగా షేర్ చేస్తున్నారు. అందం శాశ్వతం అనుకునేవారు ఈ ఫోటోలు చూడాలి అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: క్యాన్సర్ బారిన పడి మరణించిన ఒకప్పటి మిస్ వరల్డ్ నిషా గిమిరే యొక్క ఫోటోలు.
ఫాక్ట్: నిషా గిమిరే రోడ్డు ప్రమాదం వలన ఆరోగ్యం క్షీణించటంతో చనిపోయారు, క్యాన్సర్ వల్ల కాదు. భారతలోని డెహ్రాడూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిషా గిమిరే, నేపాల్‌లోని తపతాలిలోని నోర్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 01 సెప్టెంబర్ 2021న చనిపోయింది. నిషా గిమిరే ఒక నేపాలీ మోడల్, ఒకప్పటి మిస్ వరల్డ్ కాదు; సుమారు మూడు డజన్ల మ్యూజిక్ వీడియోలలో నటించారు. నిషా గిమిరే ఒకప్పటి మిస్ వరల్డ్ అని, క్యాన్సర్ బారిన పడి చనిపోయిందని ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటోతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. భారతలోని డెహ్రాడూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మోడల్ నిషా గిమిరే, నేపాల్‌లోని తపతాలిలోని నోర్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 01 సెప్టెంబర్ 2021న చనిపోయిందని తెలిపారు. నేపాల్ నలుమూలల నుండి ప్రజలు ఈ విషయం గురించి విచారం వ్యక్తం చేసారని, నిషాకు భారతదేశంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. దీనికి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. నిషా గిమిరే ఒకప్పటి మిస్ వరల్డ్ అని, క్యాన్సర్ బారిన పడి చనిపోయిందని ఈ ఆర్టికల్స్‌లో లేదు.
మూడు సంవత్సరాల క్రితం మోడలింగ్ చదవడానికి డెహ్రాడూన్‌కి వచ్చిన నిషా గిమిరే రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అక్కడ డెహ్రాడూన్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత, డబ్బులు లేకపోవటంతో ఆమెను తన తల్లితండ్రులు ఖాట్మండుకు తీసుకెళ్ళారు. జూన్ 2021లో తన పరిస్థితి క్షీణించటంతో కొంతమంది ఆమెను చూసి సహాయం చేయటానికి ముందుకొచ్చారు. నార్విక్ హాస్పిటల్ డైరెక్టర్ మేఘా చౌదరి ముందుకు వచ్చి ఆమెకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వటానికి ముందుకొచ్చారు. 01 సెప్టెంబర్ 2021న నిషా చనిపోయింది. నిషా తన కాలపు అందమైన మోడల్స్, నటీమణులలో ఒకరు. నేపాల్‌లో నిషా మరణంపై చిత్ర పరిశ్రమ మొత్తం విచారం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. ఆమె సుమారు మూడు డజన్ల మ్యూజిక్ వీడియోలలో నటించిందని ఈ ఆర్టికల్ ద్వారా చూడొచ్చు.
చివరగా, ఈ ఫోటోల్లో ఉన్నది నేపాలీ మోడల్ నిషా గిమిరే, ఒకప్పటి మిస్ వరల్డ్ కాదు. ఈవిడ రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయారు, క్యాన్సర్ వల్ల కాదు.