Fake News, Telugu
 

ఈ ఫోటోలో ప్రధాని మోదీతో పాటు కనిపిస్తున్నది గుజరాత్ వ్యవసాయ శాఖా మంత్రి, కూలిపోయిన మోర్బీ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ కాదు

0

గుజరాత్‌ రాష్ట్రం మోర్బీ నగరంలో మచ్చు నదిపై నిర్మించిన కేబల్ బ్రిడ్జ్ ఇటీవల కులిపోయి 130 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కూలిపోయిన వంతెన పునరుద్ధరణ పనులను నిర్వహించిన కాంట్రాక్టర్ ప్రధానమంత్రి మోదీతో ఉన్న ఫోటో, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ప్రభుత్వం ఈ అవినీతి కాంట్రాక్టర్‌ను విదేశాలకు పంపకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ పోస్టులో డిమాండ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్ మోర్బీ నగరంలో కూలిపోయిన తీగల వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్ ప్రధానమంత్రి మోదీతో ఉన్న ఫోటో.

ఫాక్ట్ (నిజం):  ఈ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కరిస్తున్నది గుజరాత్ వ్యవసాయ శాఖా మంత్రి రాఘవ్‌జీభాయి హంసరాజభాయి పాటిల్. మోర్బీలో కూలిపోయిన కేబుల్ బ్రిడ్జ్ పునరుద్ధరణ మరియు నిర్వహణ పనుల కాంట్రాక్ట్‌ను పొందింది గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒరేవా గ్రూప్ (అజంతా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్). ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఓధవజీభాయి రాఘవ్‌జీ పాటిల్ 2012లో చనిపోయారు. ప్రస్తుతం అజంతా-ఓరెవా సంస్థకు జైసుఖ్ భాయ్ భలోడియా నేతృత్వం వహిస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘దివ్య భాస్కర్’ మరియు ‘VTV గుజరాత్’ వార్తా సంస్థలు 2021లో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌లో దొరికింది. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి  రాఘవజీభాయి హంసరాజభాయి పాటిల్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న చిత్రమంటూ ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేశారు. ఈ ఫోటోని రాఘవజీభాయి హంసరాజభాయి పాటిల్ తన అధికారిక ట్విట్టర్  మరియు ఫేస్‌బుక్ హాండిల్స్ ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నారు.

బ్రిటిష్ హయాంలో నిర్మించిన మోర్బీ తీగల వంతెన పునరుద్ధరణ పనులను గుజరాత్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఒరేవా కంపెనీకి (అజంతా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్) అప్పజెప్పినట్టు తెలిసింది. రాఘవజీభాయి హంసరాజభాయి పాటిల్ 2019లో బీజేపీ తరుపున జాంనగర్ ఉపఎన్నికలలో పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రాఘవజీభాయి హంసరాజభాయి పాటిల్ తనకు అజంతా-ఒరేవా సంస్థలో భాగస్వామ్యం ఉనట్టు తన ఎన్నికల అఫిడవిట్లో కూడా పేర్కొనలేదు.  

అజంతా వాల్ క్లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను మొట్టమొదట ఓధవజీభాయి రాఘవజీ పాటిల్ 1971లో స్థాపించారు. ‘ఫాదర్ ఆఫ్ వాల్ క్లాక్స్’గా పేరుపొందిన ఓధవజీభాయి రాఘవజీ పాటిల్ 2012లో కన్నుమూసారు.

ప్రస్తుతం అజంతా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అందులో భాగమైన ఓరెవా సంస్థలను జైసుఖ్ భాయ్ పాటిల్ నేతృత్వం వహిస్తున్నారు. ఒరేవా సంస్థ వ్యవస్థాపకులు, నిర్వహకులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడవచ్చు.  

గుజరాత్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఒరేవా కంపెనీ వచ్చే 15 సంవత్సరాల పాటు మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ, మరమ్మతు భాధ్యతలు చూడాల్సి ఉంది. అయితే, ఒరేవా కంపెనీ మోర్బీ బ్రిడ్జ్ పునరుద్ధరణ పనులను దేవప్రకాశ్ సొల్యూషన్ అనే థర్డ్ పార్టీ సంస్థకు అప్పజెప్పినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటనకు బాధ్యులయిన బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది మరియు టికెట్ కలెక్టర్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.

చివరగా, ఈ ఫోటోలో నరేంద్ర మోదీతో పాటు ఉన్నది గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి రాఘవజీభాయి హంసరాజభాయి పాటిల్, కూలిపోయిన మోర్బీ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ కాదు.  

Share.

About Author

Comments are closed.

scroll